వచ్చే ఏడాది ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ‘ఫిఫా’
2022 ప్రపంచకప్‌తో పోలిస్తే 48.9 శాతం పెరిగిన మొత్తం ప్రైజ్‌మనీ
అర్హత పొందిన 48 జట్లకూ లభించనున్న ప్రైజ్‌మనీ
దోహా: మరో ఏడు నెలల్లో జరగనున్న ప్రపంచకప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) గురువారం వెల్లడించింది. ఈసారి విజేత జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టు ఖాతాలో 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు) చేరుతాయి. 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఓవరాల్ ప్రైజ్‌మనీ 65 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 5,905 కోట్లు) కావడం విశేషం.
2022లో ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీలో 48.9 శాతం పెరుగుదల ఉంది. 2022 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ 44 కోట్లు కావడం గమనార్హం. 2022 ప్రపంచకప్‌లో టైటిల్ నెగ్గిన అర్జెంటీనా జట్టుకు 4 కోట్ల 20 లక్షల డాలర్లు... రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు లభించాయి. 2026 ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాలలో నిర్వహిస్తారు.
తొలిసారి 48 జట్లతో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దోహాలో జరిగిన ‘ఫిఫా’ కౌన్సిల్ సమావేశంలో ప్రైజ్‌మనీ వివరాలకు ఆమోదం లభించింది. ఎప్పటిలాగే టోర్నీకి అర్హత సాధించిన అన్ని జట్లకు ‘ఫిఫా’ నుంచి భారీ మొత్తం అందనుంది. మెగా ఈవెంట్‌కు అర్హత పొందినందుకు 48 జట్లకు 90 లక్షల డాలర్ల (రూ. 8 కోట్ల 11 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్ ఫీజు... ప్రపంచకప్ సన్నాహాల ఖర్చుల కింద 15 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 35 లక్షలు) చొప్పున ‘ఫిఫా’ చెల్లిస్తుంది.
‘ఫిఫా’ చెల్లించే మొత్తం ఆయా దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలకు వెళుతుంది. తమ క్రీడాకారులకు ఎంత మొత్తం చెల్లించాలో ఆయా దేశాల సమాఖ్యలే నిర్ణయం తీసుకుంటాయని ‘ఫిఫా’ వివరించింది.
ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే...
విజేత: 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు)
రన్నరప్: 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు)
మూడో స్థానం: 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 261 కోట్లు)
నాలుగో స్థానం: 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 243 కోట్లు)
5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన జట్లకు
1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 171 కోట్లు చొప్పున)
9 నుంచి 16 స్థానాల్లో నిలిచిన జట్లకు
1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 135 కోట్లు చొప్పున)
17 నుంచి 32 స్థానాల్లో నిలిచిన జట్లకు
1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 99 కోట్లు చొప్పున)
33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్లకు
90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 81 కోట్లు చొప్పున)


