1998 తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత
వరుసగా ఏడోసారి పోర్చుగల్‌కు ప్రపంచకప్ బెర్త్
మిలాన్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నార్వే పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ ఇటలీ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నార్వే 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఐ’లో నార్వే జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. 24 పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచి 1998 తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌ను దక్కించుకుంది. ఆట 24వ నిమిషంలో ఎస్పోసిటో గోల్‌తో ఇటలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని ఇటలీ 63వ నిమిషం వరకు కాపాడుకుంది.
ఆ తర్వాత నార్వే ఆటగాళ్లు విజృంభించారు. నాలుగు గోల్స్ సాధించి ఇటలీకి షాక్ ఇచ్చారు. 63వ నిమిషంలో నూసా గోల్‌తో నార్వే 1–1తో స్కోరును సమం చేసింది. రెండు నిమిషాల వ్యవధిలో హాలాండ్ (77వ, 79వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయడంతో నార్వే 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 90+3వ నిమిషంలో లార్సెన్ గోల్‌తో నార్వే 4–1తో ఘనవిజయాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఐ’లో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ ‘ప్లే ఆఫ్’ టోరీ్నకి అర్హత సాధించింది. 16 జట్లు పోటీపడే యూరోపియన్ ‘ప్లే ఆఫ్ టోర్నీ’ ద్వారా నాలుగు జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి. 2018, 2022 ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించడంలో విఫలమైన ఇటలీ ఈసారీ గడ్డు పరిస్థితి ఎదుర్కోంటోంది.
రొనాల్డో లేకుండానే...
మరోవైపు గ్రూప్ ‘ఎఫ్’ నుంచి పోర్చుగల్ జట్టు వరుసగా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్‌ను సాధించింది. అర్మేనియా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ 9–1 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్ 13 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. కెప్టెన్క్రిస్టియానో రొనాల్డో లేకుండానే ఈ మ్యాచ్‌లో ఆడిన పోర్చుగల్ గోల్స్ వర్షం కురిపించింది. పోర్చుగల్ తరఫున నెవెస్ (30వ, 41వ, 81వ నిమిషాల్లో), ఫెర్నాండెస్ (45+3వ, 52వ, 72వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేయగా... వీగా (7వ నిమిషంలో), రామోస్ (28వ నిమిషంలో), కాన్సియో (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. అమెరికా, మెక్సికో, కెనడా ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు 32 జట్లు అర్హత సాధించాయి.


