రష్యాకు అనుకూలంగా గైర్హాజరైన ఇండియా
లండన్ నగరంలోని ట్రాఫాల్గర్ స్క్వేర్.. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, పండుగ శోభతో నిండిపోతుంది. ఆ స్క్వేర్ మధ్యలో నిటారుగా.. వేలాది కాంతులతో వెలిగిపోయే ఒక అద్భుతమైన క్రిస్మస్ చెట్టు కనువిందు చేస్తుంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు.. నార్వేజియన్ ప్రజల హృదయం నుండి వచ్చిన ఒక కృతజ్ఞతా బహుమతి. లండన్, నార్వే రాజధాని ఓస్లో నగరాల మధ్య కొనసాగుతున్న ఈ వార్షిక సంప్రదాయం వెనుక దాగిన కథ, మానవ సంబంధాల గొప్పతనాన్ని, చరిత్రను గుర్తు చేస్తుంది.
కష్టకాలంలో పుట్టిన స్నేహం
ఈ బంధానికి రెండో ప్రపంచ యుద్ధం కల్లోలంలో పునాదులు ఏర్పడ్డాయి. 1940లో, నాజీ జర్మనీ నార్వేపై దండెత్తినప్పుడు, అప్పటి నార్వే రాజు హాకాన్–7, అతని ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు శరణార్థులుగా వచ్చారు. అక్కడే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ గడ్డ నుండే నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమానికి బలం చేకూర్చారు. అంతేకాదు, నాజీలు రేడియోలను నిషేధించినా, బీబీసీ సహకారంతో లండన్ నుండి రహస్యంగా నార్వేజియన్ భాషలో వార్తలను ప్రసారం చేసేవారు. ఆ వార్తలు నార్వే దేశ ప్రజలకు ధైర్యాన్ని, ఆశను నింపిన జీవనాడులు. నిరాశలో ఉన్న వేలాది నార్వేజియన్లకు అక్షరాలా అవి ఓ సాంత్వన!
హృదయం నుండి వచ్చిన కానుక
యుద్ధం ముగిసిన తర్వాత, నార్వే ప్రజలు తమకు ఆశ్రయం ఇచ్చి, తమ స్వాతంత్య్ర పోరాటానికి సహాయం చేసినందుకు బ్రిటన్‌పై అపారమైన కృతజ్ఞతను చూపాలనుకున్నారు. ఆ ప్రేమే 1947లో ఓస్లో నగర పాలక సంస్థ ఈ వార్షిక క్రిస్మస్ ట్రీ బహుమతిని ప్రకటించడానికి దారి తీసింది. ఈ బహుమతి కేవలం అలంకరణ వస్తువు కాదు. ‘ఓస్లో ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తికి లండన్ ప్రజలు ఇచి్చన అండ’కు ప్రతీక.
‘ఎవర్ ఓస్లో’సాహస యాత్ర
ఏటా ఓస్లో అడవుల్లో పెరిగే నార్వేజియన్ స్ప్రూస్ జాతి చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. కొన్నేళ్ల ముందుగానే నాణ్యమైన చెట్లను గుర్తించి, వాటికి ప్రత్యేక సంరక్షణ అందిస్తారు. ఈ ఏడాది చెట్టుకు ముద్దుగా ‘ఎవర్ ఓస్లో’అని పేరు పెట్టారు. సుమారు 60 ఏళ్ల వయసు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు, వేలాది చెట్ల నుండి ఎంపికైంది. నవంబర్ 21న జరిగిన ప్రత్యేక వేడుకలో దీనిని నరికి, ఓ ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి, రోడ్డు మార్గంలో ఓడరేవుకు తరలించారు. అక్కడి నుండి మొదలైంది అసలు ప్రయాణం. దాదాపు 26 గంటల పాటు సముద్రంలో ప్రయాణించాక ఆ చెట్టు లండన్‌కు చేరుకుంది. లండన్ చేరుకున్నాక, దాన్ని ట్రక్కులో ట్రాఫాల్గర్ స్క్వేర్‌కు తరలించారు. ఈ ప్రయాణమంతా ఆ చెట్టు.. రెండు దేశాల స్నేహ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక రాయబారిలా సాగింది.
సంప్రదాయ దీపాలంకరణ
సోషల్ మీడియాలో ఈ చెట్టును ‘బ్రిటన్ జాతీయ నిధి’గా అభివర్ణిస్తారు. ఏటా డిసెంబర్ మొదటి గురువారం జరిగే దీపాలంకరణ వేడుకతో లండన్‌లో క్రిస్మస్ కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ఈ చెట్టుకు నార్వేజియన్ సంప్రదాయం ప్రకారం నిలువు వరుసలలో దీపాలను అమరుస్తారు. ఈ కాంతులు.. స్క్వేర్‌లోని ప్రజలకు ఆశ, శాంతి సందేశాన్ని ఇస్తాయి. ఈ క్రిస్మస్ ట్రీ, జనవరి 5 వరకు ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత దీనిని కంపోస్ట్ తయారీకి వినియోగిస్తారు. ప్రతి క్రిస్మస్‌కు నార్వే పంపే ఈ ట్రీ బహుమతి, కేవలం పండుగ ఆనందం కోసం కాదు. యుద్ధ గాయాలను, మళ్లీ వెలిగించిన ఆశలను గుర్తుచేసే శాశ్వత చిహ్నం. ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ఈ దీపాలు వెలిగిన ప్రతిసారీ, అది క్రిస్మస్‌కు సంకేతం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఒక దేశం మరో దేశానికి ఇచ్చిన అండ.. సాటి మనిషిపై చూపిన మానవత్వం.. నేటికీ సజీవంగా ఉన్నాయనడానికి హృదయపూర్వకమైన, శాశ్వతమైన కృతజ్ఞతా వెలుగు!
– సాక్షి, నేషనల్ డెస్క్


