లండన్: లండన్ నడిబొడ్డున చైనా నిర్మించతలపెట్టిన వివాదాస్పద సూపర్ ఎంబసీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించనుంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మరికొద్ది నెలల్లో చైనాలో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఎంబసీ ప్రణాళికకు ఆమోదం తెలపాలని నిర్ణయించింది. స్టార్మర్ ప్రతిపాదనకు హోం శాఖ, విదేశాంగ శాఖలు అడ్డుచెప్పే అవకాశాలు లేవని ది టైమ్స్ కథనం పేర్కొంది.
అయితే, జాతీయ భద్రతా ప్రయోజనాలకు లోబడి ఇందులో కొన్ని మినహాయింపులుండొచ్చని తెలిపింది. డిసెంబర్ 10వ తేదీలోగా అధికారికంగా అనుమతి లభించవచ్చని పేర్కొంది. చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం తమ దేశంలో గూఢచర్యానికేనని యూకే అనుమానిస్తోంది. అయితే, ఎంబసీ ప్రణాళికను ఆమోదించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని చైనా హెచ్చరికలు చేయడం గమనార్హం.


