Indonesia: వరద బీభత్సం.. 14 మంది మృతి | Flash Floods in Indonesia's North Sulawesi | Sakshi
Sakshi News home page

Indonesia: వరద బీభత్సం.. 14 మంది మృతి

Jan 6 2026 10:39 AM | Updated on Jan 6 2026 10:50 AM

Flash Floods in Indonesia's North Sulawesi

జకార్తా: ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో గల సియావు ద్వీపంలో  అకస్మాత్తుగా సంభవించిన వరదలు భీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు,  ఒక్కసారిగా తాకిన వరద ఉధృతికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానిక సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షం సియావు ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తులో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరద తాకిడికి రోడ్లు, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల నిర్వహణ ప్రతినిధి నూరియాదిన్ గుమెలెంగ్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 16 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. కాగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన బురద, శిథిలాల కారణంగా రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి, ఈ అడ్డంకులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
 

విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ అందించిన సమాచారం ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 444 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే కొన్ని నెలల పాటు ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలగనుంది. అలాగే మరిన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అక్కడి ప్రజలకు అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: ‘ఏఐ ఉత్త బడుద్దాయి’.. నిగ్గు తేల్చిన గణిత శాస్త్రవేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement