కొలంబియా
ట్రంప్ తరచూ పేర్కొనే ‘డ్రగ్స్ ధూర్త’దేశాల్లో ఇదొకటి. వెనెజువెలా రాజధాని కరాకాస్‌పై అమెరికా దాడి చేసిన కొద్ది గంటల్లోనే కొలంబియాకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపుల వెనక ఉన్నది కూడా ‘చమురు’ఆకాంక్షలేనన్నది పరిశీలకుల అంచనా. ఎందుకంటే వెనెజువెలాకు పశ్చిమాన ఉండే కొలంబియా కూడా భారీ చమురు నిక్షేపాలకు ఆలవాలమే. పైగా వెనెజువెలా మాదిరిగానే అది కూడా నిత్యం కల్లోలంగా ఉండే దేశమే. ట్రంప్ నిజంగా దాడికే నిర్ణయించుకుంటే ఇది ఆయన పనిని సులభతరం చేసే అంశమే. ట్రంప్ పదేపదే మొత్తుకుంటున్న డ్రగ్స్ భూతం నిజంగానే కొలంబియాలో విశ్వరూపం దాల్చింది.
మొత్తం లాటిన్ అమెరికాలోనే డ్రగ్స్ వ్యాపారానికి కేంద్రబిందువు ఆ దేశమే! ముఖ్యంగా కొకైన్ అక్కడ ఏరుగులా పారుతుంటుంది. ఈ డ్రగ్స్‌ను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో విచ్చలవిడిగా అమెరికాలోకి గుమ్మరిస్తున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం. ఈ కారణంగానే ఆయనపై గత అక్టోబర్లో ట్రంప్ భారీ ఆంక్షలు కూడా విధించారు. ‘‘కొలంబియాను ఓ శాడిస్టు పాలిస్తున్నాడు. అతని హయాం ఇంకెంత కాలమో సాగబోదు’’అని ఆదివారం ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే కొలంబియాలో ఉన్నట్టుండి అమెరికా బలగాలో, ప్రత్యేక దళాలో దిగినా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల అంచనా!
ఇరాన్
ప్రస్తుతం భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న దేశమిది. ఇటీవల ఇజ్రాయెల్‌తో ఇరాన్ ‘12 రోజుల’ఘర్షణల సందర్భంగా అమెరికా కూడా ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపించడం తెలిసిందే. ముఖ్యంగా అక్కడి అణు స్థావరాలు, మౌలిక సదుపాయాలను తుత్తునియలు చేసింది. తాజా ఆందోళనలను కూడా మరోసారి తనకు అనువుగా ఉపయోగించుకునే దిశగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఆందోళనకారులను పొట్టన పెట్టుకుంటే సహించేది లేదని, భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్‌ను బెదిరించారాయన.
‘‘ఇరాన్ గతంలోలా తన సొంత ప్రజలను పొట్టన పెట్టుకుంటామంటే ఊరుకోబోం. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని కూడా చెప్పుకొచ్చారు. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలో ట్రంప్ జరిపిన సుదీర్ఘ భేటీలో ప్రధాన చర్చనీయాంశం ఇరానే అని కూడా చెబుతున్నారు! త్వరలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులకు దిగేలా ఆ భేటీలో పథక రచన కూడా జరిగిందని అంటున్నారు! అదే నిజమైతే సందట్లో సడేమియా మాదిరిగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగానే అమెరికా కూడా మరోసారి ఇరాన్‌పై పెద్దపెట్టున విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు.
మెక్సికో
ట్రంప్ తొలినుంచీ ద్వేషిస్తూ వస్తున్న దేశం. 2016లో తొలిసారి అధ్యక్ష బరిలో దిగినప్పుడు ఆయన ప్రధాన నినాదం, ఎజెండా కూడా దక్షిణాన మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ కడతాననే! గతేడాది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టగానే ట్రంప్ చేసిన తొలి సంతకం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ఫైలు మీదే! ఆ దేశమంటే ఆయనకు ఆ స్థాయిలో విద్వేషం!! డ్రగ్స్‌తో పాటు అక్రమ వలసదారులు కూడా మెక్సికో నుంచి అమెరికాలోకి విచ్చలవిడిగా పోటెత్తుతున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం.
దీని కట్టడికి ఆ దేశం ఉద్దేశపూర్వకంగానే గట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ‘‘మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ చాలా శక్తిమంతమైనవి. వాటి కట్టడికి ఇక అమెరికానే ఏదో ఒకటి చేయాలి’’అని ఆదివారం మీడియా భేటీలోనే ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘వాటిపై పోరుకు అమెరికా సైన్యాన్ని పంపుతానంటే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ తిరస్కరించారు’అంటూ అసహనం కూడా వెలిబుచ్చారు.
క్యూబా
అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే ఈ బుల్లి కమ్యూనిస్టు దేశం దశాబ్దాలుగా దానికి కంట్లో నలుసుగా మారింది. ఫలితంగా 1960ల నుంచీ అమెరికా నుంచి భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. వెనెజువెలాతో క్యూబాకు అత్యంత సన్నిహిత బంధముంది. వెనెజువెలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయినట్టే. ఇది ఆ బుల్లి దేశపు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేలా కని్పస్తోంది. బహుశా అందుకేనేమో, ‘‘క్యూబా ఆదాయమంతటికీ వెనెజువెలా నుంచి వస్తున్న చమురే ఆధారం. ఆ మార్గం మూసుకున్న కారణంగా అదిప్పటికే కుప్పకూలుతున్న దేశం. కనుక దానిపై సైనిక చర్య కూడా అనవసరమేమో’’అంటూ ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు.
క్యూబాలో అధికార మారి్పడి అత్యవసరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పదేపదే చెబుతుండటం తెలిసిందే. గత శనివారం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి మదురో దంపతులను బందీలుగా పట్టుకున్న అనంతరం రూబియో మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను గనక ఇప్పుడు (క్యూబా రాజధాని) హవానాలో ఉంటే, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యుంటే కాస్త ఆందోళనలోనే పడి ఉండేవాన్ని’అన్నారు. తద్వారా, క్యూబాపై అమెరికా ఇప్పటికే గురి పెట్టిందని చెప్పకనే చెప్పారు. ఇంతా చేస్తే, రూబియోది క్యూబా నుంచి అమెరికాకు వలస వచి్చన కుటుంబం కావడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్


