ట్రంప్‌ మలి గురి... గ్రీన్‌లాండ్‌? | Greenland could be Trump next target after Venezuela | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మలి గురి... గ్రీన్‌లాండ్‌?

Jan 7 2026 3:57 AM | Updated on Jan 7 2026 7:40 AM

Greenland could be Trump next target after Venezuela

ఆ దిశగా స్పష్టమైన సంకేతాలు

‘20 రోజుల్లో..’అంటూ వ్యాఖ్యలు

భౌగోళికంగా, సైనికంగా కీలకం

ఖనిజ, చమురు నిక్షేపాలు అపారం 

నయా సామ్రాజ్యవాది అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండేనా? ఆయన వ్యాఖ్యలు, దూకుడు, సహచర గణం ప్రకటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అర్ధరాత్రి వేళ సొంత నివాసం నుంచి నిర్బంధించి తీసుకొచ్చిన ట్రంప్‌ తెంపరితనం ప్రపంచాన్ని విస్మయానికి లోనుచేయడం తెలిసిందే. తానక్కడితో ఆగేది లేదని, దారికి తేవాల్సిన దేశాలు ఇంకొన్ని ఉన్నాయని ఓ జాబితానే చదివారు ట్రంప్‌. వాటిలో కొలంబియా, క్యూబాతో పాటు మెక్సికో వంటివాటిని చేర్చడమే గాక, ‘అవసరమైతే వాటిపై ఏ క్షణమైనా విరుచుకుపడతాం’అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

అయితే వీటన్నింటి కంటే ముందు ట్రంప్‌ తదుపరి లక్ష్యం డెన్మార్క్‌ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ కానుందన్నది విశ్లేషకుల అంచనా. ఆదివారం మీడియాతో ట్రంప్‌ మాటతీరు కూడా దాన్ని బలపరిచేవిగానే ఉంది. ‘‘ఒక 20 రోజులాగండి, గ్రీన్‌లాండ్‌ గురించి మనమంతా మాట్లాడుకుందాం’’అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. అంతేకాదు, ‘‘గ్రీన్‌లాండ్‌ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.

ఒకట్రెండు నెలల్లో దీనిపై గట్టిగానే దృష్టి సారిస్తాం’’అంటూ కుండబద్దలు కొట్టారు కూడా. నిజానికి ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉండగానే 2019లోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామంటూ డెన్మార్క్‌కు ప్రతిపాదించారు. కానీ అక్కడి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయినప్పటినుంచీ గ్రీన్‌లాండ్‌ ఆక్రమణ కాంక్షను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఇటీవల పలుమార్లు మీడియాముఖంగానే తన మనోగతాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. గ్రీన్‌లాండ్‌ స్వా«దీనానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని కూడా ప్రకటించారు! అంతేకాదు, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేసుకోవాలని తీవ్రంగా వాదించే లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీని ఏరికోరి ఆ ప్రాంతానికి ప్రత్యేక రాయబారిగా పంపారు కూడా! 

ఎందుకంత ఆసక్తి? 
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా. 

అపార ఖనిజ నిల్వలు 
గ్రీన్‌లాండ్‌ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్‌ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్‌ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్‌ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్‌లాండ్‌ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్‌ యోచన. ఇక గ్రీన్‌లాండ్‌లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్‌ వ్యూహం. 

అతి పెద్ద ద్వీపం 
గ్రీన్‌లాండ్‌. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్‌లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్‌లాండ్‌వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్‌ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్‌లాండ్‌ జనాభా కేవలం 57 వేలు! – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

 

 

నాటో భవితవ్యమేమిటో?! 
గ్రీన్‌లాండ్‌ విషయమై అమెరికా, డెన్మార్క్‌ మధ్య మొదలైన రగడ నాటో కూటమి అస్తిత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. అత్యంత శక్తిమంతమైన నాటో కూటమిలో అవి రెండూ సభ్య దేశాలేనన్నది తెలిసిందే. కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా అది అందులోని దేశాలన్నిటిపైనా దాడిగానే పరిగణించి అంతా కలసికట్టుగా ఎదుర్కోవాలన్నది నాటో ఒప్పందం. అలాంటప్పుడు అమెరికా ఏకంగా తోటి సభ్య దేశంపైనే దాడికి దిగితే అది కూటమి మూల, వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధమవుతుంది.

అందుకే, అమెరికా దాడి నాటోకు అంతమేనన్న డెన్మార్క్‌ ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో నాటోలోని యూరప్‌ దేశాలు వెంటనే స్పందించాయి. ‘‘ఆర్కిటిక్‌ ప్రాంతమంతా యూరప్‌ ప్రయోజనాలకు అతి కీలకం. అందుకే అక్కడ మా దేశాల ఉనికి, కార్యకలాపాలతో పాటు పెట్టుబడులను కూడా నానాటికీ విస్తరిస్తూ వస్తున్నాం. దాన్ని సురక్షితంగా ఉంచడానికే మా ప్రాధాన్యం. డెన్మార్క్‌తో పాటు గ్రీన్‌లాండ్‌ కూడా నాటోలో భాగమే’’అంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

అమెరికాయే కీలకం 
నాటో కూటమిలో అమెరికాయే కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. కూటమి రక్షణ బడ్జెట్లో 17 శాతం వాటా ఆ దేశానిదే. కనుకనే గ్రీన్‌లాండ్‌ రక్షణ, సంరక్షణ కూడా తమ బాధ్యతే కావాలన్నది ట్రంప్‌ సలహాదారు స్టీఫెన్‌ వాదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement