
ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి దక్షిణాఫ్రికా అర్హత
జొహనెస్‌బర్గ్: ఆతిథ్య దేశం హోదాలో చివరిసారి 2010లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైంది. 16 ఏళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికా మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఆఫ్రికా జోన్ క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని దక్కించుకొని వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే వరల్డ్‌కప్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఆరు జట్లను గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా పది మ్యాచ్‌లు ఆడి 18 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. రువాండాతో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 1998, 2002 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా 2010లో ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. అయితే మూడు పర్యాయాలు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
ఆఫ్రికా జోన్ నుంచి సెనెగల్, ఐవరీకోస్ట్ జట్లు కూడా 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘బి’లో సెనెగల్, గ్రూప్ ‘ఎఫ్’లో ఐవరీకోస్ట్ జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. 2026 ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఆఫ్రికాకు 9 బెర్త్‌లు కేటాయించగా... తొమ్మిదీ ఖరారయ్యాయి. గతంలోనే ఆఫ్రికా నుంచి అల్జీరియా, ఈజిప్ట్, ట్యూనిషియా, మొరాకో, ఘనా, కెప్ వెర్డె ప్రపంచకప్‌కు అర్హత పొందాయి.
ఖతర్, సౌదీ అరేబియా కూడా...
ప్రపంచకప్‌లో ఆసియా దేశాలకు కేటాయించిన 8 బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. ఆసియా క్వాలిఫయింగ్ నాలుగో రౌండ్ గ్రూప్ విజేతల హోదాలో ఖతర్, సౌదీ అరేబియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నాలుగో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఖతర్ 2–1తో యూఏఈ జట్టును ఓడించగా... ఇరాక్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను సౌదీ అరేబియా 0–0తో ‘డ్రా’ చేసుకొని తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆసియా నుంచి గతంలో జపాన్, ఇరాన్, ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, దక్షిణ కొరియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
యూరప్ నుంచి ఇంగ్లండ్
ఆఫ్రికా, ఆసియా కోటాలు పూర్తి కాగా... యూరప్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘కె’లో ఇంగ్లండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 18 పాయింట్లతో వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. 17వసారి ప్రపంచకప్‌లో ఆడనున్న ఇంగ్లండ్ 1966లో ఏకైకసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. యూరప్ నుంచి మరో 15 జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాల్సి ఉంది.