breaking news
world cup football tournment
-
16 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి దక్షిణాఫ్రికా అర్హత
జొహనెస్‌బర్గ్: ఆతిథ్య దేశం హోదాలో చివరిసారి 2010లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైంది. 16 ఏళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికా మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఆఫ్రికా జోన్ క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని దక్కించుకొని వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే వరల్డ్‌కప్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్లను గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా పది మ్యాచ్‌లు ఆడి 18 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. రువాండాతో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 1998, 2002 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా 2010లో ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. అయితే మూడు పర్యాయాలు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆఫ్రికా జోన్ నుంచి సెనెగల్, ఐవరీకోస్ట్ జట్లు కూడా 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘బి’లో సెనెగల్, గ్రూప్ ‘ఎఫ్’లో ఐవరీకోస్ట్ జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. 2026 ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఆఫ్రికాకు 9 బెర్త్‌లు కేటాయించగా... తొమ్మిదీ ఖరారయ్యాయి. గతంలోనే ఆఫ్రికా నుంచి అల్జీరియా, ఈజిప్ట్, ట్యూనిషియా, మొరాకో, ఘనా, కెప్ వెర్డె ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. ఖతర్, సౌదీ అరేబియా కూడా... ప్రపంచకప్‌లో ఆసియా దేశాలకు కేటాయించిన 8 బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. ఆసియా క్వాలిఫయింగ్ నాలుగో రౌండ్ గ్రూప్ విజేతల హోదాలో ఖతర్, సౌదీ అరేబియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నాలుగో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఖతర్ 2–1తో యూఏఈ జట్టును ఓడించగా... ఇరాక్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను సౌదీ అరేబియా 0–0తో ‘డ్రా’ చేసుకొని తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆసియా నుంచి గతంలో జపాన్, ఇరాన్, ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, దక్షిణ కొరియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. యూరప్ నుంచి ఇంగ్లండ్ ఆఫ్రికా, ఆసియా కోటాలు పూర్తి కాగా... యూరప్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘కె’లో ఇంగ్లండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 18 పాయింట్లతో వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. 17వసారి ప్రపంచకప్‌లో ఆడనున్న ఇంగ్లండ్ 1966లో ఏకైకసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. యూరప్ నుంచి మరో 15 జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాల్సి ఉంది. -
ఘనా ఐదోసారి...
అక్రా: వచ్చే ఏడాది జరిగే పురుషుల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఆఫ్రికా జోన్ నుంచి ఘనా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికాక్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఘనా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారైంది. కోమోరోస్ జట్టుతో ‘డ్రా’ చేసుకుంటే ప్రపంచకప్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిలో ఘనా జట్టు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో టోటెన్హమ్ జట్టుకు ఆడే మొహమ్మద్ కుడుస్ 47వ నిమిషంలో గోల్ చేసి ఘనా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి 19 జట్లు అర్హత పొందాయి. ఇందులో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో జట్లకు నేరుగా అర్హత దక్కింది. ఆఫ్రికా జోన్ నుంచి 9 జట్లకు అవకాశం ఉండగా... ఇప్పటికి ఐదు జట్లు (మొరాకో, ట్యూనిషియా, ఈజిప్‌్ట, అల్జీరియా, ఘనా) బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఐదోసారి ప్రపంచకప్ ఆడనున్న ఘనా జట్టు 2010లో క్వార్టర్ ఫైనల్ చేరి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. -
మరో విజయం సాధిస్తే...
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది. ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. -
హమ్మయ్య.. సమ్మె ఆగింది!
సావో పాలో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు ఇప్పుడు ఇలాగే ఫీలవుతున్నారు. ప్రారంభ వేడుకలతో పాటు ఆరంభ మ్యాచ్ కూడా జరిగే ప్రధాన స్టేడియానికి రవాణా సదుపాయం కలిగించే సావో పాలో సబ్వే కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో అభిమానులను అక్కడికి ఎలా చేర్చాలనే దానిపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. అయితే తమ సమ్మె కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో.. ఏమో కానీ బుధవారం రాత్రి నుంచి తమ ఆందోళనను విరమించుకున్నారు. జీతాల పెంపు కోరుతూ చేస్తున్న ఈ సమ్మె పట్ల 15 వందల మంది సబ్వే కార్మికులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సరైందని నమ్ముతున్నట్టు యూనియన్ అధ్యక్షుడు అల్టినో ప్రెజర్స్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా తాము సమ్మెకు దూరం కాలేదని.. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రియో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మె రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభమైన గురువారం నుంచి ఒక రోజు పాటు రియో విమానాశ్రయ సిబ్బంది పాక్షిక సమ్మెకు దిగారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 70 శాతం మంది విధుల్లో ఉండగా మిగిలిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రపంచకప్ బోనస్, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, 12 శాతం జీతాల పెంపును వీరు డిమాండ్ చేస్తున్నారు.