
ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత
అక్రా: వచ్చే ఏడాది జరిగే పురుషుల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఆఫ్రికా జోన్ నుంచి ఘనా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికాక్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఘనా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారైంది. కోమోరోస్ జట్టుతో ‘డ్రా’ చేసుకుంటే ప్రపంచకప్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిలో ఘనా జట్టు 1–0 గోల్ తేడాతో గెలిచింది.
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో టోటెన్‌హమ్ జట్టుకు ఆడే మొహమ్మద్ కుడుస్ 47వ నిమిషంలో గోల్ చేసి ఘనా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి 19 జట్లు అర్హత పొందాయి.
ఇందులో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో జట్లకు నేరుగా అర్హత దక్కింది. ఆఫ్రికా జోన్ నుంచి 9 జట్లకు అవకాశం ఉండగా... ఇప్పటికి ఐదు జట్లు (మొరాకో, ట్యూనిషియా, ఈజిప్‌్ట, అల్జీరియా, ఘనా) బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఐదోసారి ప్రపంచకప్ ఆడనున్న ఘనా జట్టు 2010లో క్వార్టర్ ఫైనల్ చేరి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.