మరో పరాభవం పిలుస్తోంది! | India heading for defeat in second Test | Sakshi
Sakshi News home page

మరో పరాభవం పిలుస్తోంది!

Nov 26 2025 2:58 AM | Updated on Nov 26 2025 2:58 AM

India heading for defeat in second Test

రెండో టెస్టులో ఓటమి దిశగా భారత్‌

లక్ష్యం 549... ప్రస్తుతం 27/2

చేతిలో 8 వికెట్లతో ‘డ్రా’ కోసం పోరాటం

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 260/5 డిక్లేర్డ్‌ 

పుష్కర కాలం పాటు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఓడిపోని జట్టు ఇప్పుడు 12 నెలల వ్యవధిలో రెండో సిరీస్‌ పరాజయానికి చేరువైంది. స్వదేశీ పిచ్‌లపై పరుగుల వరద పారించి ప్రత్యర్థికి సవాల్‌ విసిరే టీమ్‌ ఇప్పుడు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో పరువు కోసం పోరాడుతోంది. టెస్టులో చివరి రోజు ఒక్కో బంతి గండంలా కనిపిస్తుంటే... మ్యాచ్‌ను కాపాడుకునేందుకు విదేశీ జట్లు పడిన పాట్లు ఎన్నో చూశాం. 

ఇప్పుడు మన జట్టు సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అవతలి వైపు బౌలర్లు చెలరేగిపోతుంటే ఎనిమిది వికెట్లతో రోజంతా నిలిచి బేలగా ‘డ్రా’ కోసం ఆడాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ రకంగానూ సాధ్యం కాదు కాబట్టి సిరీస్‌ ఓటమి అనేది ఖాయమైపోయింది. 

ఇక తేడా 0–1తోనా లేక 0–2తోనే అని తేలడమే మిగిలింది! ఏదైనా అద్భుతం జరిగి ఓటమి నుంచి తప్పించుకుంటారేమో అనే ఆశ ఉన్నా... ఈ సిరీస్‌లో భారత్‌ ఆట చూస్తే అలాంటి నమ్మకం కూడా కనిపించడం లేదు.  

గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (13), కేఎల్‌ రాహుల్‌ (6) అవుట్‌ కాగా... ప్రస్తుతం సాయి సుదర్శన్‌ (2 బ్యాటింగ్‌), కుల్దీప్‌ యాదవ్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఆఖరి రోజు భారత్‌ మరో 522 పరుగులు చేయాల్సి ఉంది.

 అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 26/0తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (180 బంతుల్లో 94; 9 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... టోనీ జోర్జి (68 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. 

మంగళవారం ఆటలో జడేజాకు వికెట్లు దక్కిన తీరు, ఆ తర్వాత హార్మర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ అయిన బంతిని చూస్తే చివరి రోజు పిచ్‌పై అనూహ్యమైన టర్న్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో మన బ్యాటర్లు రోజంతా నిలవడం కూడా అసాధ్యం కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితిని బట్టి 80 ఓవర్ల ఆట మాత్రమే జరిగే అవకాశం ఉంది.  

కీలక భాగస్వామ్యాలు... 
ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం ఉన్నా... దక్షిణాఫ్రికా వేగంగా ఆడి డిక్లేర్‌ చేసే ప్రయత్నం చేయలేదు. సాధారణ టెస్టు ఇన్నింగ్స్‌ తరహాలోనే బ్యాటర్లు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు జోడించారు. ఫలితంగా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి.

 తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్లు రికెల్టన్‌ (64 బంతుల్లో 35; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (84 బంతుల్లో 29; 3 ఫోర్లు)లను తక్కువ వ్యవధిలో వెనక్కి పంపించగా, బవుమా (3)ను సుందర్‌ లెగ్‌ స్లిప్‌ ఉచ్చులో పడేశాడు. 

అయితే స్టబ్స్, జోర్జి కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం 27 ఓవర్ల పాటు సాగింది. 129 బంతుల్లో స్టబ్స్‌ అర్ధ సెంచరీని చేరుకోగా, జడేజా బౌలింగ్‌లో స్వీప్‌ చేసే ప్రయత్నంలో జోర్జి అర్ధసెంచరీ కోల్పోయాడు. 

లంచ్‌ విరామ సమయానికే దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులకు చేరింది. అయినా సరే ఆ జట్టు డిక్లేర్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విరామం తర్వాత స్టబ్స్‌ జోరు పెంచాడు. తాను ఆడిన తర్వాతి 24 బంతుల్లో 34 పరుగులు రాబట్టిన అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే జడేజా ఓవర్లో సిక్స్‌ బాది 94కు చేరిన అతను మరో సిక్స్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. దాంతో బవుమా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.  

అదే తడబాటు... 
రెండో ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌ కొంత ధాటిగా మొదలు పెట్టినా, రాహుల్‌ వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే మరోసారి యాన్సెన్‌ చక్కటి బంతితో జైస్వాల్‌ను అవుట్‌ చేసి పతనానికి శ్రీకారం చుట్టగా... హార్మర్‌ స్పిన్‌కు రాహుల్‌ స్టంప్‌ కూలింది. 

తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్‌ కుల్దీప్‌ ఈసారి కూడా డిఫెన్స్‌ ఆడే పాత్రను పోషిస్తూ 22 బంతులు సమర్థంగా ఎదుర్కొన్నాడు. సాయి, కుల్దీప్‌ కలిసి 39 బంతులు ఆడి మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. దక్షిణాఫ్రికా ఆలస్యంగా డిక్లేర్‌ చేసినట్లు అనిపించినా... జట్టు తీసిన 2 వికెట్లు వారి నిర్ణయాన్ని సరైందిగా నిరూపించాయి.  

స్కోరు వివరాలు  
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 489; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 35; మార్క్‌రమ్‌ (బి) జడేజా 29; స్టబ్స్‌ (బి) జడేజా 94; బవుమా (సి) నితీశ్‌ (బి) సుందర్‌ 3; జోర్జి (ఎల్బీ) (బి) జడేజా 49; ముల్డర్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78.3 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్‌) 260. వికెట్ల పతనం: 1–59, 2–74, 3–77, 4–178, 5–260. బౌలింగ్‌: బుమ్రా 6–0–22–0, సిరాజ్‌ 5–1–19–0, జడేజా 28.3–3–62–4, కుల్దీప్‌ 12–0–48–0, సుందర్‌ 22–2–67–1, జైస్వాల్‌ 1–0–9–0, నితీశ్‌ రెడ్డి 4–0–24–0.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 13; రాహుల్‌ (బి) హార్మర్‌ 6; సుదర్శన్‌ (బ్యాటింగ్‌) 2; కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 27. వికెట్ల పతనం: 1–17, 2–21. బౌలింగ్‌: యాన్సెన్‌ 5–2–14–1, ముల్డర్‌ 4–1–6–0, హార్మర్‌ 3.5–2–1–1, మహరాజ్‌ 3–1–5–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement