ఏదో రకంగా వెనెజువెలాను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశా అధ్యక్షుడు మదురోను బంధించి, ఆపై పదవీ వీచ్యుతుడిని చేసి వెనెజువెలా పై ఆధిపత్యం కనబరిచింది అమెరికా. తమ దేశానికి మదురో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఒక నింద వేసి.. ఆయనపై నార్కో టెర్రరిస్టు ముద్ర వేసి జైల్లో ఉంచింది.
అయితే ఇప్పుడు వెనెజువెలా చమురును ఎలా అమ్ముకోవాలనే యోచన చేస్తోంది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం. భారత్ ఓకే అంటే వెనెజువెలా చమురును అమెరికా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌పై ట్రంప్ తంత్రం.. కుతంత్రం ఇదేనా?
అసలు రష్యా చమురును బారత్ ఎందుకు ఆపాలనే దానిపై అమెరికా పెద్దలు స్పష్టంగా ఏమీ చెప్పరు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడానికనే ఒక కుంటిసాకు చెబుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం నేపధ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనపడింది.
ఇప్పుడు ఆ దేశ చమురును భారత్ కొనుగోలు చేయకుండా ఆపేస్తే మరింత ఇబ్బందిని పుతిన్ ప్రభుత్వానికి చూపించాలనేది ట్రంప్ మరొక ఆలోచన అయి ఉండొచ్చు. అదే సమయంలో వెనెజువెలా చమురును భారత్‌కు సరఫరా చేసి క్యాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశమే ట్రంప్‌లో కనిపిస్తోంది. అందుకు 500 శాతం సుంకాలంటూ ట్రంప్ భయపెట్టే పనిపెట్టుకున్నారు.
భారత్ ఎంత వరకూ భయపడుతుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే, వెనెజువెలా చమురులో నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చమురును బయటకు తీసిన తర్వాత విక్రయాలు జరపడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుందని, అప్పుడు కానీ అందులో నాణ్యత రాదని అంటున్నారు. ఒకవేళ సాధారణ ప్రాసెస్‌లో వెనెజువెలా చమురును అమ్మకాలు జరిపితే మాత్రం మరింత కాలుష్యానికి కారణం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
పడితే గిడితే.. మేమే బాగుపడాలి..!
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అంతా స్వార్తపూరితమే కనిపిస్తోందని కాదనలేని సత్యం. కాస్త పెద్ద దేశాల్ని సుంకాలతో భయపెట్టడం, చిన్న దేశాలపైకి యుద్ధం పేరుతో దాడి చేయడం జరుగుతుంది. ఇరాన్ మొదలుకొని ఇప్పటి గ్రీన్‌లాండ్ వ్యవహారంలో కూడా ట్రంప్ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. పైకి తానొక శాంతి ప్రభోధకుడిగా చెప్పుకుంటూ.. తానొక నియంత అని నిరూపించుకుంటూనే ఉన్నారు ట్రంప్. బాగుపడితే మేమే బాగుపడాలి.. మేము అగ్రజులం అనే దూర్త లక్షణం మాత్రం కనిపిస్తోంది.
కొత్త కంట్రోల్డ్ ఫ్రేమ్ వర్క్ తర్వాత..
ఇప్పటికే యూఎస్‌ఏ కఠినమైన ఆంక్షలతో చెలరేగిపోతోంది. తమ మాట వినేవారికి ఒక రకంగా, వినని వారికి మరో రకంగా ట్రీట్‌మెంట్ ఇస్తూనే ఉంది. ట్రంప్ పాలన చేపట్టిన తర్వాత ఆంక్షల పర్వమే కనిపిస్తోంది. భారత్‌కు వెనెజువెలా చమురును అమ్మడానికి కొత్త గవర్నెన్స్‌ను తీసుకొస్తామంటోంది వైట్‌హౌస్. కచ్చితమైన నియమాలతో ఉండే కంట్రోల్డ్ ఫ్రేమ్ వర్క్ తర్వాత భారత్‌కు వెనెజువెలా చమురును అమ్ముతామని తెలిపింది.
భారత్ ఏమంటోందో చూడాలి..
ఈ అంశంపై భారత్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇంకా భారత్‌కు చాన్స్ ఉందంటూ 500 శాతం సుంకాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ స్పష్టం చేసిన తర్వాతే వెనెజువెలా చమురు అంశాన్ని అమెరికా తెరపైకి తీసుకొచ్చింది. అంటే వన్ బై వన్ ప్రణాళిక ప్రకారమే ట్రంప్ వ్యూహం సిద్ధం చేసినట్లు కనబడుతోంది. బలవంతంగా భారత్ చేత ఎంతో కొంత చమురును కొనుగోలు చేయించేందుకు అమెరికా సన్నద్ధమైందనేది వరుసగా జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది.
భారత్‌కు రష్యాను ప్రధాన సరఫదారు..
2022 తర్వాత భారత్‌కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. రష్యా చమురు తక్కువ ధరలో లభిస్తోంది, అందుకే భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. 2025 నవంబర్‌లో భారత్ రష్యా నుంచి 7.7 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసింది.
ఇది భారత మొత్తం చమురు దిగుమతుల్లో 35.1% వాటా కాగా, దాని విలువ 3.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. భారత చమురు బిల్లు లో 34% భాగంగా ఉంది. జనవరి–అక్టోబర్ 2025లో రష్యా నుంచి దిగుమతులు గత సంవత్సరం కంటే 17.8% తగ్గాయి. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేయడం తగ్గింది.
ట్రంప్ ముందస్తు వ్యూహం కాక మరేమిటి.?
మరి ఇప్పుడు అమెరికా.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో కచ్చితంగా వెనెజువెలా చమురు అంశాన్ని లేవనెత్తడం ఖాయం. అమెరికా వరుస గేమ్ ప్లాన్స్ కూడా అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ముందుగా త్వరలో 500 శాతం సుంకాలు పెంపు అనడం,, ఇంకా భారత్‌తో ఒప్పందానికి సమయం ఉందని అనడం, ఇప్పుడు వెనెజువెలా చమురును భారత్‌కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా వైట్‌హౌస్ వర్గాలు అనడం.. ఇవన్నీ కూడా ట్రంప్ ముందస్త వ్యూహం కాక మరేమిటి.?
ఇదీ చదవండి:


