పొరుగు దేశాలను ఆదుకునే విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి తమ ఉదారత చాటుకుంది. డిట్వా తుఫానుతో అతలాకుతలమైన శ్రీలంకకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక సాయంతో ముందుకొచ్చింది. భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో శ్రీలంకలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
డిట్వా తుఫాన్ బాధితుల సహాయార్థం బీసీసీఐ ఈ టూర్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. టెస్ట్‌లకు అదనంగా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించింది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిట్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు షెడ్యూల్‌లో లేని టూర్ ఎక్స్‌టెన్షన్‌ను ప్లాన్ చేసింది.
ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధ్యక్షుడు షమ్మి సిల్వా ధృవీకరించారు. భారత్-శ్రీలంక మధ్య ఉన్న సహృదయ వాతావరణాన్ని, పెరుగుతున్న స్నేహాన్ని ప్రస్తావించారు. అదనపు టీ20ల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
వాస్తవానికి తాజా పరిణామానికి ముందే భారత జట్టు డిసెంబర్‌లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు (డిట్వా తుఫాన్ బాధితులకు నిధులు సమకూర్చేందుకు) ఒప్పుకుంది. ఆ పర్యటనలో భారత్-శ్రీలంక జట్లు రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కార్యరూపం దాల్చకముందే, బీసీసీఐ ఆగస్ట్ విండో ప్రతిపాదనకు సమ్మతించింది.
కాగా, గతేడాది నవంబర్ చివర్లో డిట్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలు
డిట్వా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను “Rebuilding Sri Lanka” కార్యక్రమానికి అంకితం చేసింది. ఈ సిరీస్‌లో #VisitSriLanka పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నారు.


