టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్‌పై పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జేసన్ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్‌లో ఓ పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్‌గా వ్యవహరించమని అడిగాడు.
ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్ వాష్ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్ చేశాడు.
ఈ ఆఫర్‌ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్ యూజర్-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐకి పాకిస్తాన్ కోచ్‌గా పని చేసిన వారికి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్ కోచ్ అయ్యేంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్ ఎక్స్ యూజర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్‌ను భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు.
అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.
వాస్తవానికి గంభీర్‌పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.
ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.
ఇంత దారుణమైన ట్రాక్ ఉంటే సహజంగానే ఏ కోచ్‌పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.
గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్‌లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్) ఆ పదవికి రాజీనామా చేశాడు.
గిల్లెస్పీ జమానాలో పాక్ బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్ మొహిసిన్ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు.


