స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..
పదవి నుంచి తొలగించాలి
గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే
ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.
కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.
వారిదే తుది నిర్ణయం
అయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.
అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.


