టీ20ల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు న్యూజిలాండ్ ఓటమి రుచిని చూపించింది. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 50 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 216 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చతికల పడింది.
కివీస్ బౌలర్ల దాటికి భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65), రింకూ సింగ్(39) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్లాక్‌క్యాప్స్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు, డఫీ, సోధి రెండు వికెట్లు సాధించారు.
అతడితో పాటు మాట్ హెన్రీ, ఫౌల్క్స్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
"ఈ మ్యాచ్‌లో కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు పూర్తి స్ధాయి బౌలర్లతో ఆడాలని నిర్ణయించుకున్నాము. 180 ప్లస్ టార్గెట్‌ను చేసేటప్పుడు ఆరంభంలోనే రెండు మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను ఎలా తీసుకుంటారో పరీక్షించాలనుకున్నాము.
ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌లో అవకాశమివ్వాలనుకున్నాం.మేము మొదట బ్యాటింగ్ చేసినప్పుడు బాగానే ఆడుతున్నాం. కానీ ఛేజింగ్‌లో వికెట్లు పడితే మా ఆటగాళ్లు బాధ్యతను ఎలా స్వీకరిస్తారో చూడాలనుకున్నాము. మాకు మేమే ఛాలెంజ్ చేసుకున్నాము. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నా.
వచ్చే మ్యాచ్‌లో అవకాశం వస్తే మళ్లీ ఛేజింగ్ చేయడానికే ఇష్టపడతాం. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శివమ్ దూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా మరొక బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఒక బ్యాటర్ తక్కువగా బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చి పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో తీసుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఆఖరికి బెడిసికొట్టింది.
చదవండి: హార్దిక్, అర్ష్ దీప్ కీలకం: రోహిత్


