న్యూఢిల్లీ: భారత జట్టు టి20 వరల్డ్ కప్ నిలబెట్టుకోవాలంటే అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో అర్ష్ దీప్ చాలా ప్రమాదకారి అని, మిడిలార్డర్‌లో పాండ్యా బలమైన బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని రోహిత్ అన్నాడు. రోహిత్ నాయకత్వంలోనే 2024లో టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
‘కొత్త, పాత బంతులను ఒకే తరహాలో స్వింగ్ చేయడం అర్ష్ దీప్ ప్రత్యేక బలం కాగా రెండు సందర్భాల్లోనూ వికెట్లు పడగొట్టగలడు. 2024 ఫైనల్లో అతను చాలా బాగా బౌలింగ్ చేసాడు. ఆరంభంలో డికాక్ వికెట్ తీసిన అర్ష్ దీప్ 19వ ఓవర్లో తక్కువ పరుగులు ఇవ్వడం విజయానికి బాటలు వేసింది.
ఈసారీ అదే జరుగుతుంది. జట్టులో పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌గా ఎంతో విలువైన ఆటగాడు. బ్యాటింగ్ చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టగలడు. అవసరమైతే 50/4 స్కోరు నుంచి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. పైగా ఏ దశలోనైనా బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా అతని సొంతం’ అని రోహిత్ ప్రశంసించాడు.


