తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్‌కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ అందింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.
సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.
అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి.
300 శాతం పెరిగిన ప్రైజ్‌మనీ
వన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

బీసీసీఐ భారీ నజరానా
వరల్డ్‌కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.
కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్


