దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో హర్యానా- జార్ఖండ్ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
101 పరుగులు
మరో ఓపెనర్ విరాట్ సింగ్ (2) విఫలమైనా.. ఇషాన్ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా మెరుపు హాఫ్ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.
ధనాధన్ ఇన్నింగ్స్
అనంతరం అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40), రాబిన్ మింజ్ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సమంత్ జేఖర్, సుమిత్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్ అంకిత్ కుమార్, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్ సివాజ్ డకౌట్ అయ్యారు.
పోరాడిన మిడిలార్డర్
ఇలాంటి దశలో మిడిలార్డర్‌లో యశ్‌వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53), నిషాంత్ సింధు (15 బంతుల్లో 31), సమంత్ జేఖర్ (17 బంతుల్లో 38) ధనాధన్ ఆడి.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.
ఆఖర్లో పార్త్ వట్స్ (4), సుమిత్ కుమార్ (5), అన్షుల్ కాంబోజ్ (11) తడబడగా.. అమిత్ రాణా (13 నాటౌట్), ఇషాంత్ భరద్వాజ్ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.
జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్ సింగ్, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు
That winning feeling! 🥳
Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌
Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025


