ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై! | Tension Boils Over Between Stokes And Archer Ponting Reaction Viral | Sakshi
Sakshi News home page

AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై

Dec 18 2025 5:40 PM | Updated on Dec 18 2025 6:17 PM

Tension Boils Over Between Stokes And Archer Ponting Reaction Viral

యాషెస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా రెండోరోజూ ఆధిపత్యం కొనసాగించింది. అడిలైడ్‌ వేదికగా గురువారం ఆట పూర్తయ్యే సరికి.. ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 213 పరుగులే చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 158 పరుగులు వెనుకబడింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లిష్‌ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.

ఓపెనర్లు జాక్‌ క్రాలీ (9), బెన్‌ డకెట్‌ (29) నిరాశపరచగా.. ఓలీ పోప్‌ (3), జో రూట్‌ (19) కూడా విఫలం అయ్యారు. ఇలాంటి దశలో హ్యారీ బ్రూక్‌ (45), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (45 నాటౌట్‌) మెరుగైన ఆటతో జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేశారు. 

మిగిలిన వారిలో జేమీ స్మిత్‌ 22 పరుగులు చేయగా.. విల్‌ జాక్స్‌ (6), బ్రైడన్‌ కార్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో టెయిలెండర్‌ జోఫ్రా ఆర్చర్‌ 30 పరుగులతో అజేయంగా నిలవడంతో.. స్కోరు 200 అయినా దాటగలిగింది.

ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) మూడు వికెట్లతో చెలరేగగా.. స్కాట్‌ బోలాండ్‌ రెండు, నాథన్‌ లియోన్‌ రెండు, కామెరాన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

స్టార్క్‌ అర్ధ శతకం
ఇదిలా ఉంటే.. అంతకు ముందు 326/8తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ 371 పరుగులకు ఆలౌట్‌ అయింది.  టెయిలెండర్‌ మిచెల్‌ స్టార్క్‌ అర్ధ శతకం(54)తో అదరగొట్టడంతో కంగారూలకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.

ఇంగ్లండ్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టార్క్‌ వరుస విరామాల్లో ఫోర్లు బాదుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే, అతడిని నిలువరించేందుకు ఇంగ్లండ్‌ సారథి స్టోక్స్‌ తన వ్యూహాలన్నీ అమలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తమ జట్టు స్టార్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer)పై అసహనం ప్రదర్శించాడు.

ఇందుకు ఆర్చర్‌ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 86వ ఓవర్లో బంతితో రంగంలో దిగిన ఆర్చర్‌.. స్టార్క్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. దెబ్బకు లెగ్‌ స్టంప్‌ కూడా ఎగిరిపోయింది.

చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!
ఈ క్రమంలో ఆర్చర్‌ను సహచరులు అభినందిస్తుండగా.. స్టోక్స్‌ మాత్రం.. ‘‘నువ్వు ప్రతిసారి ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్ల గురించి ఫిర్యాదు చేయకు. సరైన లైన్‌ అండ్ లెంగ్త్‌తో‌ బౌల్‌ చేయి’’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరే వేళ సహచరులు వారిని విడదీశారు.

ఈ నేపథ్యంలో ఆర్చర్‌.. ‘‘నాకే సలహా ఇస్తున్నాడు చూడు’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. కాగా స్టోక్స్‌- ఆర్చర్‌ వాగ్వాదం గురించి కామెంటేటర్‌, ఆసీస్‌ దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ స్పందిస్తూ..

‘‘ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. స్టోక్స్‌ నేరుగా అతడి దగ్గరికి వెళ్లి క్లాస్‌ తీసుకున్నాడు. అయితే, ఇందుకు ఆర్చర్‌ చెంప మీద కొట్టినట్లుగా వికెట్‌తో సమాధానం ఇచ్చాడు’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శనతో పేసర్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడం విశేషం.

చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్‌ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement