ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు స్టీవ్ స్మిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. స్మిత్ 'వర్టిగో' (తల తిరగడం) వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరిచింది.
స్మిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వికారం, తలతిరగడం వంటి లక్షణాలు అతడికి ఉన్నాయి. స్మిత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయారు. అతడిని ఆడించి రిస్క్ తీసుకుడదని మెనెజ్‌మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. అతడు తిరిగి నాలుగో టెస్టు సమయానికి పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంది అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నాడు.
అదరగొట్టిన ఉస్మాన్..
ఇక స్మిత్ స్ధానంలో వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజాకు తుది జట్టులో చోటు దక్కింది. గత రెండు టెస్టుల్లో ఆడని ఖవాజా.. స్మిత్ స్ధానంలో నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. అయితే ఉస్మాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లు వెనుదిరగడంతో ఖవాజా జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. 120 బంతుల్లో 82 పరుగులు చేసి కీలక నాక్ ఆడాడు. 48 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్‌కు కాస్త ఊరటనిచ్చే ఆంశం.
మూడో టెస్టుకు ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్
జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, కెమెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.


