ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్‌! | Prithvi Shaw Back At Delhi Capitals At IPL 2026 Mini Auction After Unsold Drama, More Details Inside | Sakshi
Sakshi News home page

Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్‌!

Dec 17 2025 8:29 AM | Updated on Dec 17 2025 9:46 AM

Prithvi Shaw back at Delhi Capitals after IPL 2026 auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా తిరిగి తన సొంత గూటికి చేరాడు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెన‌ర్ బ్యాట‌ర్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌నీస ధ‌ర రూ.75 ల‌క్ష‌లకే సొంతం చేసుకుంది. 

వేలం తొలి సెట్‌లో వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఆ త‌ర్వాత సెకెండ్ యాక్సిలరేటెడ్ రౌండ్‌లో కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సో​ల్డ్‌గా మిగిలిపోయాడు. రెండు రౌండ్లలో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా నిరాశచెందాడు. 

వెంటనే పృథ్వీ షా..తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. కానీ ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనికరించింది. చివరి రౌండ్‌లో అతడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. యాక్సిలరేటెడ్ ప్రాసెస్‌లో ఎంపికైన 11 మంది ఆటగాళ్లలో షా కూడా ఉన్నాడు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ముందు పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసి.. కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ అతడు రాసుకొచ్చాడు.

కాగా 2018లో కెప్టెన్‌గా భార‌త్‌కు అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన పృథ్వీ షాను.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా మారాడు. పృథ్వీ డీసీకి ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఐపీఎల్‌-2021 వరకు కేవలం రూ. 1.20 అందుకున్న పృథ్వీ షా జీతం ఒక్కసారిగా 525 శాతం పెరిగింది. 

ఐపీఎల్‌-2022 సీజన్‌లో అతడిని రూ.7.50 కోట్ల​కు ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అనంత‌రం ఐపీఎల్‌-2023, 2024 సీజ‌న్‌ల‌లో ఈ మ‌హ‌రాష్ట్ర ఆట‌గాడు రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ పేల‌వ ఫామ్‌, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల వ‌ల్ల అత‌డిని ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. 

వేలంలోకి వ‌చ్చిన పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా.. దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఆ ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.
చదవండి: ఐపీఎల్‌కు కరీంనగర్‌ కుర్రాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement