ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్. గాయం కారణంగా మరికొన్ని వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. 34 ఏళ్ల ఈ ఆసీస్ ఫాస్ట్‌బౌలర్.. స్వదేశంలో జరిగిన గత 25 మ్యాచ్‌లలో 15 గాయాల వల్ల మిస్సయ్యాడు.
ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టులకూ హాజిల్‌వుడ్ అందుబాటులో లేకుండా పోయాడు. తన కెరీర్‌లో ఇప్పటికి 76 టెస్టులు ఆడిన హాజిల్‌వుడ్.. 295 వికెట్లు కూల్చాడు. అయితే, మూడు వందల వికెట్ల అరుదైన క్లబ్‌లో ఇప్పట్లో చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.
వేధిస్తున్న గాయాలు
కెరీర్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆకట్టుకున్న హాజిల్‌వుడ్.. స్వదేశంలో, విదేశాల్లో తనదైన శైలిలో రాణించాడు. అయితే, ముందుగా చెప్పినట్లు గత కొన్నాళ్లుగా అతడి టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసేందుకు సహకరించడం లేదు.
పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు తరచూ అతడిని వేధిస్తున్నాయి. తాజాగా చీలమండ వెనుక భాగం నొప్పి తీవ్రం కావడంతో హాజిల్‌వుడ్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
రేసులో వారంతా
గత ఐదు వేసవి సీజన్లలో ఆసీస్ ఆడిన ఇరవై టెస్టుల్లో హాజిల్‌వుడ్ పది మాత్రమే ఆడాడు. నైపుణ్యాల పరంగా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నప్పటికీ గాయాల బెడద వల్ల అతడి టెస్టు కెరీర్ ముందుగానే ముగింపు దశకు చేరుకునేలా ఉంది. హాజిల్‌వుడ్ స్థాయిలో కాకపోయినా.. స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, బ్రెండన్ డాగట్, జేవియర్ బార్ట్‌లెల్, సీన్ అబాట్ వంటి పేసర్లు సత్తా చాటుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు.
టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తాడా?
ఇలాంటి తరుణంలో గాయాల వల్ల హాజిల్‌వుడ్ తరచూ జట్టుకు దూరం కావడం.. అతడి కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టెస్టుల సంగతి పక్కనపెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హాజిల్‌వుడ్‌కు తిరుగులేదన్నది వాస్తవం. ప్రపంచస్థాయి టీ20 అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు కొనసాగుతున్నాడు.
ఆసీస్ 2021లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో హాజిల్‌వుడ్‌దీ కీలక పాత్ర. వన్డేల్లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్-2027లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగే ఆస్ట్రేలియాకు అతడి సేవలు అత్యంత ముఖ్యం.
తెలివైన నిర్ణయం తీసుకుంటేనే
ఈ పరిణామాలను బట్టి ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా హాజిల్‌వుడ్ టెస్టులకు వీడ్కోలు పలికి.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ ఫార్మాట్‌కు స్వస్తి పలికి టీ20, వన్డేలలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తేనే కెరీర్‌కు మరికొన్నాళ్లపాటు ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, పూర్తిగా టెస్టులకు వీడ్కోలు పలకపోయినా.. కొన్నాళ్ల పాటు ఆ ఫార్మాట్‌కు దూరంగా ఉంటే పరిస్థితి చక్కబడవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న హాజిల్‌వుడ్.. కెరీర్ కొనసాగింపులో భాగంగా ఈ దశలో తెలివైన నిర్ణయం తీసుకుంటేనే అంతా సజావుగా సాగిపోతుందని మెజారిటీ మంది అభిప్రాయం. అయితే, హాజిల్‌వుడ్ మాత్రం తనలో ఇంకా మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పేర్కొనడం కొసమెరుపు.
చదవండి: Ashes: మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. వాళ్లిద్దరిపై వేటు


