ఎవరైనా బాగా పనిచేస్తే ప్రశంసలు దక్కడం సహజం. మీరిక్కడ చూస్తున్న ఫొటో అలాంటి సందర్భంలోదే. ముంబై పోలీసులను ఫుట్‌బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖడే స్టేడియం వద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు కనిపించాయి. వందలాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చప్పట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నినదించారు. అంతమంది తమను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లయోనల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ పలకరించడంతో వారంతా ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్ అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
చప్పట్లు కొడుతూ.. థ్యాంక్స్
కార్యక్రమాలన్నీ సజావుగా సాగడంతో వాంఖడే స్టేడియానికి వచ్చిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తారని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
అర్థమవుతోందా?
''శాంతిభద్రతల నిర్వహణ పరంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్యవస్థ ఉత్తమమైనది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజన్ ప్రశంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మరొకరు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్‌కతా పోలీసులను ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశారు.
కోల్‌కతాలో ఏం జరిగింది?
శనివారం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశకు గురిచేయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రశావేశాలకు లోనయ్యారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్‌లేక్ సేడియం రణరంగంగా మారిపోయింది. అభిమానులను నియంత్రించలేక కోల్‌కతా పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడు శరత్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పౌరుల ప్రవర్తన, ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై మెస్సీకి క్షమాపణలు చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని నిర్వహకుడు ప్రకటించడం గమనార్హం.


