మెస్సీకి క్రికెట్ జ్ఞాపికలు
భారత్‌లో ముగిసిన దిగ్గజం పర్యటన
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ టూర్‌లో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించిన మెస్సీ అభిమానులకు వీడ్కోలు పలుకుతూ స్వదేశం బయల్దేరాడు. చివరి రోజు సోమవారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మెస్సీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ముంబైల తరహాలోనే ఇక్కడి షో కూడా సరదాగా సాగింది.
అభిమానుల మధ్య దాదాపుగా అవే దృశ్యాలు ఇక్కడా పునరావృతమయ్యాయి. చిరునవ్వుతో తిరుగుతూ అభివాదం చేసిన అతను ఆ తర్వాత 7x7 సెలబ్రిటీ మ్యాచ్‌ను తిలకించాడు. సహచరులు స్వారెజ్, రోడ్రిగోలతో కలిసి మెస్సీ తన కిక్‌లతో కొన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపించడంతో ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా పాల్గొన్న కార్యక్రమం విశేషంగా నిలిచింది.
మెస్సీ, స్వారెజ్, రోడ్రిగోల పేర్లు, నంబర్లు రాసి ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రత్యేక ‘బ్లూ’ జెర్సీలను వారికి కానుకగా ఇవ్వడంతో పాటు 2024 టి20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల సంతకాలతో కూడిన ప్రత్యేక బ్యాట్‌ను కూడా బహుకరించారు. భారత్‌లో జరిగే 2026 టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ (భారత్ x అమెరికా) టికెట్‌ను కూడా మెస్సీకి జై షా ఇచ్చారు.
ప్రధానితో భేటీ లేదు...
ఢిల్లీ కార్యక్రమంలో ముందుగా అనుకున్న విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ
కలవలేదు. వీరిద్దరి భేటీ కోసం ప్రత్యేకంగా 21 నిమిషాల ప్రొటోకాల్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే ప్రధాని జోర్డాన్ పర్యటనకు వెళ్లి
పోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది.
‘మళ్లీ వస్తా’
భారత్‌లో నాకు లభించిన ప్రేమాభిమానాలకు ఎంతో కృతజు్ఞడను. ఈ పర్యటన చిన్నదే కావచ్చు కానీ నిజంగా చాలా గొప్ప అనుభవం. నన్ను ఇక్కడి వాళ్లు ఎంతో అభిమానిస్తారని వింటూ వచ్చిన మాటలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాతో వ్యవహరించిన తీరు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మీ ప్రేమను మాతో పాటు తీసుకెళుతున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడికి తిరిగి వస్తాను. అది మ్యాచ్ ఆడటానికి కావచ్చు లేదా మరో సందర్భం కావచ్చు కానీ భారత్‌లో మాత్రం మళ్లీ అడుగు పెడతా. అందరికీ కృతజ్ఞతలు.
–మెస్సీ


