భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
స్పందించిన బీసీసీఐ
మరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.
‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు.
రీఫండ్ నిబంధనల ప్రకారం..
కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట!
కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.


