లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 భారీ పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. సాయంత్రం 6:30 గంటలకు పడాల్సిన టాస్.. పొగమంచు కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. పొగ మంచు దుప్పటిలా కప్పేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది.
సాయత్రం 6:50 నుండి 9:25 గంటల వరకు అంపైర్లు దాదాపు ఆరుసార్లు పిచ్‌ను పరిశీలించారు. చివరకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాత్రి 9:25 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలి నాణ్యత సూచీ 400 దాటిపోవడంతో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అంపైర్‌లు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్ ఉన్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు.
"అంపైర్ల నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. సమయం గడిచేకొద్దీ పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పొరపాటు. నేను దీనికంటే దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి" అని ఉతప్ప పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్లు అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్ మూడో టీ20కే ముందు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా గిల్ కాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో టీ20కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నారు.
చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!


