భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌ను శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ వరకు అతడి సేవలు వినియోగించుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2014 నుంచి 2021 వరకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధర్... ఈ ఏడాది ఆరంభంలో లంకలో 10 రోజుల ప్రత్యేక ఫీల్డింగ్ క్యాంప్ నిర్వహించాడు. ‘శ్రీధర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించాం. టి20 వరల్డ్‌కప్ వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
బీసీసీఐ లెవల్–3 అర్హత ఉన్న శ్రీధర్ అనుభవం మా జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. మా ఆటగాళ్ల ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకు అతడు సహకరిస్తాడు. పాకిస్తాన్, ఇంగ్లండ్ పర్యటనల్లోనూ అతడి సేవలు వినియోగించుకుంటాం’ అని ఎస్‌ఎల్‌సీ తెలిపింది.
దీనిపై శ్రీధర్ స్పందిస్తూ లంక జట్టుతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించాడు. ‘ఆటగాళ్ల తీరుకు తగ్గట్లు కోచింగ్ ఉంటుంది. సహజంగా లంకేయులు క్యాచ్‌లు పట్టడంలో చురుకుగా వ్యవహరిస్తారు. ఇక ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగు పరచడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరి శరీర తీరును బట్టి వాళ్ల ప్రయత్నం ఉంటుంది. దానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని శ్రీధర్ అన్నాడు.


