
శ్రీలంక మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సాలియా సమన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై ఐదేళ్ల 5 ఏళ్ల నిషేధాన్నిఐసీసీ విధించింది.
అబుదాబి టీ10 లీగ్ 2021లో మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు సమన్ ప్రయత్నాలు చేసినట్లు అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై సెప్టెంబర్ 13, 2023న ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించబడింది. అయితే ఇప్పుడు ఆ కేసులో అతడిని ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. దీంతో తొలుత విధించిన తేదీ నుంచే అతడి నిషేదం అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.
అంటే అతడు మరో మూడున్నరేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడేందుకు వీలులేదు. అతడిపై ఈసీబీ కోడ్‌లోని ఆర్టికల్స్ 2.1.1, 2.1.3, 2.1.4 కింద అభియోగాలు మోపబడ్డాయి. మ్యాచ్‌లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, గిప్ట్‌లు ఇస్తామని ఆశచూపడం వంటివి ఈ ఆర్టికల్స్ ఉల్లంఘనకు కిందకు వస్తాయి.
సమన్ తన దేశీయ కెరీర్‌లో 101 ఫస్ట్-క్లాస్, 77 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడి పేరిట 231 ఫస్ట్‌క్లాస్ వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా 101 మ్యాచ్‌ల్లో 3,662 పరుగులు చేశాడు. కాగా ఇదే కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ నసీర్ హుస్సేన్‌పై కూడా ఐసీసీ అభియోగాలు మోపింది. అతడు ఇటీవలే తన రెండేళ్ల నిషేదాన్ని పూర్తి చేసకుని తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు.
చదవండి: గిల్‌కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా