సరికొత్త ఆశలతో మానవాళి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. నవ్వులతో నవ వసంతానికి నాంది పలుకుతూ నూతన ఏడాది ఆగమనాన్ని వేడుకగా జరుపుకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లి గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాన్నాళ్ల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
లైట్ ఆఫ్ మై లైఫ్
ఆ తర్వాత చాలాకాలానికి తాజాగా కోహ్లి న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను’’ అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
లండన్‌లోనే
కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. పిల్లలను సెలబ్రిటీ లైఫ్ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో విరుష్క జోడీ ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటోంది. ఇంతవరకు వారి ఫొటోలను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక ఈ జంట ఇటీవలే ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది.
టెస్టులకు బైబై
ఇదిలా ఉంటే.. కోహ్లికి 2025 మిశ్రమంగా గడిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అతడు వరుసగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో మే నెలలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సంప్రదాయ ఫార్మాట్లో పదివేల పరుగులు చేయకుండానే ‘టెస్టు కింగ్’ నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వన్డేల్లో మాత్రం కోహ్లి మరోసారి సత్తా చాటాడు.
వన్డే రారాజుగానే..
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను భారత్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన కోహ్లి.. ఆసీస్ టూర్‌లో మాత్రం వరుస మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయితే, అదే పర్యటనలో మూడో వన్డేతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస శతకాలతో చెలరేగాడు.
తద్వారా 53వ వన్డే సెంచరీ నమోదు చేసి అత్యధిక సెంచరీల వీరుడిగా తన రికార్డు తానే సవరించాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇక్కడా శతక్కొట్టాడు. కాగా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి చిరకాల కోరిక గతేడాది నెరవేరినా.. ఆర్సీబీ విజయోత్సవాలకు వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో మృతి చెందడంతో విషాదం నెలకొంది.
చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!


