టీమిండియా స్టార్ రిషభ్ పంత్ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్ కీపర్.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.
దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది.
సమంత్రాయ్ హాఫ్ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు.
పంత్ సహా వారంతా విఫలం
ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్ష్ ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.
ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.
చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్ కీపర్ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్ ఆప్షన్ ఎవరంటే?


