వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1తో కేఎల్ రాహుల్ గెలిచాడు.
పంత్ స్థానానికి ఎసరు!
ఈ సిరీస్‌లో రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఎంపిక చేసిన యాజమాన్యం.. అతడిని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఈ నేపథ్యంలో.. గత కొన్నిరోజులుగా భారత దేశీ క్రికెట్‌లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్‌గానూ వన్డేల్లో పంత్ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచకప్-2026 టోర్నీ ఆడే జట్టులో చోటు
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) రేసులోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులతో సత్తా చాటి.. కెప్టెన్‌గా జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్‌గా, అటు వికెట్ కీపర్‌గా రాణించగల ఇషాన్‌ను ఏకంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు.
సంజూ శాంసన్ (Sanju Samson)కు బ్యాకప్‌గా ఇషాన్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు. కర్ణాటకతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 125 పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్.. ఆరో స్థానంలో వచ్చి ఈ మేరకు చెలరేగడం విశేషం.
వన్డే వరల్డ్‌కప్ జట్టులోనూ అతడే ఉండే ఛాన్స్!
ఇప్పటికి టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్.. 42.40 సగటుతో ఏకంగా 933 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ కూడా ఉంది. చివరగా 2023 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఈ జార్ఖండ్ ప్లేయర్ వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా 2023లో ఆఖరిగా టీమిండియాకు ఆడిన ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20లలో ఆడే అవకాశం వచ్చి తనను తాను నిరూపించుకోవడం సహా.. వన్డేల్లోనూ ఫామ్‌ను కొనసాగిస్తే ప్రపంచకప్-2027 జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది.
ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీ కోసం బ్యాకప్‌గా ఇషాన్ ఉపయోగపడతాడు. అంతేకాదు మిడిలార్డర్‌లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. ఇక వికెట్ కీపర్‌గానూ సేవలు అందించగలడు. కాబట్టి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టీమిండియా వన్డే బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
రేసులోకి ధ్రువ్ జురెల్
మరోవైపు.. ధ్రువ్ జురెల్ సైతం రేసులోకి వచ్చాడు. దేశీ క్రికెట్లో అతడు రెడ్‌హాట్ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 307 పరుగులు సాధించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ వచ్చి చితక్కొట్టగలనని నిరూపించాడు.
ఇప్పటికే భారత టెస్టు జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ధ్రువ్ జురెల్.. లిస్ట్-ఎ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా వన్డే జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. భారత్- ఎ టూర్లలో వన్డే బ్యాకప్ వికెట్ కీపర్‌గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తర్వాత ధ్రువ్ జురెల్ అత్యుత్తమ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
పంత్ ఇలాగే ఉంటే కష్టమే!
వీరిద్దరు ఇలా సత్తా చాటుతుండగా.. మరోవైపు రిషభ్ పంత్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోతున్నాడు. వన్డేల్లో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికి 31 మ్యాచ్‌లలో కలిపి సగటు 33తో 871 పరుగులు చేశాడు. అయితే, గత కొంతకాలంగా వన్డే తుదిజట్టులో అతడికి చోటే కష్టమైంది.
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్‌పై 70 పరుగులు సాధించడం మినహా.. మిగతా రెండు మ్యాచ్‌లలో అతడు విఫలమయ్యాడు. మేనేజ్‌మెంట్ నుంచి మద్దతు ఉంది కాబట్టి.. కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్ భర్తీ చేయవచ్చు. అయితే, వన్డేల్లో అతడి గణాంకాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తాయని చెప్పలేము. ఈ రేసులో పంత్, జురెల్‌లను దాటి ఇషాన్ కిషన్ ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తదుపరి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా బిజీ కానుంది.


