టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ... ఐసీసీ మహిళల టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా 28 ఏళ్ల దీప్తి రికార్డుల్లోకెక్కింది. శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన దీప్తి... తాజా ర్యాంకింగ్స్‌లో 737 పాయింట్లతో ‘టాప్’ ప్లేస్‌కు చేరింది.
ఆస్ట్రేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ (736 పాయింట్లు), పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్ (732 పాయింట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా స్మృతి మంధాన (766 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... లంకతో తొలి పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ (653 పాయింట్లు) ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. రెండో మ్యాచ్‌లో దంచికొట్టిన షఫాలీ వర్మ (650 పాయింట్లు) పదో స్థానంలో ఉంది.


