
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరూ భారత జెర్సీలో కన్పించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వన్డే వరల్డ్‌కప్-2027 కోసం వారిద్దరూ స్ధానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రో-కో వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్, కోహ్లి సేవలు భారత జట్టుకు కచ్చితంగా అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుత భారత వన్డే జట్టులో నంబర్ 1, నంబర్ 3లో సరైన ఆటగాళ్లు లేరు. ప్రత్యేకంగా ఛేజింగ్‌లో ఆయా స్ధానాల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు కావాలి. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ భారత జట్టులో కొనసాగాలి. వారిద్దరి తమ సేవలను టీమిండియాకు మరి కొన్నాళ్లపాటు అందించాలి. ఇక శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్బుతంగా రాణించాడు.
వన్డే జట్టును కూడా నడిపించగలడు. కానీ గిల్‌కు విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు అవసరం. వారిద్దరూ వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లు. కచ్చితంగా వారిద్దరూ భారత డ్రెస్సింగ్ రూమ్‌లో భాగం కావాలి" అని టెలికాం ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా భవిష్యత్తులో వన్డేల్లో కూడా భారత జట్టు పగ్గాలను గిల్‌కు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే..: భువీ