విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ దేవ్‌దత్ పడిక్కల్, ముంబై సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పడిక్కల్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు శతక్కొట్టాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 147 పరుగులతో దుమ్ములేపిన పడిక్కల్.. కేరళపై 124 పరుగులు సాధించాడు.
టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి
అనంతరం పుదుచ్చేరిపై 113 పరుగులతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. మరోవైపు.. సర్ఫరాజ్ బుధవారం విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. గోవాతో మ్యాచ్‌లో 75 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు బాది 157 పరుగులు సాధించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ వన్డేలకూ తాను సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాడు.
వీరిద్దరితో పాటు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సైతం దేశీ వన్డే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ రుతు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 331 పరుగులు చేయడంలో రుతుది కీలక పాత్ర.
మరోవైపు.. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్ తరపున బుధవారం నాటి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన షమీ.. జమ్మూ కశ్మీర్‌పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వీరంతా అదరగొడుతుంటే.. టీమిండియా రెగ్యులర్ జట్టులో భాగమైన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, ఆంధ్ర సారథి నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం నిరాశపరుస్తున్నారు.
ఆంధ్ర జట్టుకు మూడో పరాజయం
నితీశ్ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు (Andhra Cricket Team).. బ్యాటర్ల వైఫల్యం కారణంగా విజయ్ హజారే ట్రోఫీలో మూడో పరాజయం మూటగట్టుకుంది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఓడింది.
మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ హార్విక్ దేశాయ్ (81 బంతుల్లో 61; 7 ఫోర్లు), చిరాగ్ జానీ (96 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్), రుచిత్ అహిర్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు.
ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3 వికెట్లు పడగొట్టగా... కలిదిండి రాజు 2 వికెట్లు తీశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, జాగర్లపుడి రామ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు తడబడింది. బ్యాటర్లంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవడంతో... ఆంధ్ర జట్టు 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.
జ్ఞానేశ్వర్ (33; 6 ఫోర్లు), హేమంత్ రెడ్డి (29; 4 ఫోర్లు), కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (30; 4 ఫోర్లు), రాజు (30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... శ్రీకర్ భరత్ (4), రికీ భుయ్ (4), యారా సందీప్ (0) విఫలమయ్యారు.
సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అంకుర్ పన్వర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం గుజరాత్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.
మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి?
అంతకు ముందు.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లోనూ నితీశ్ రెడ్డి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించారు. ఐదో స్థానంలో వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.
అనంతరం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. రిషభ్ పంత్ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 121 (ఆంధ్రపై 5, గుజరాత్‌పై 70, సౌరాష్ట్రపై 22, ఒడిశాపై 24)పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్ ఇలా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.


