టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన | Australia announce Squad for T20 WC 2026 3 injured players selected | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఆసీస్‌ జట్టు ప్రకటన.. ‘గాయపడిన’ ఆ ముగ్గురికీ చోటు

Jan 1 2026 10:23 AM | Updated on Jan 1 2026 12:24 PM

Australia announce Squad for T20 WC 2026 3 injured players selected

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసిన టెస్టు కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

ఆ ఇద్దరికీ చోటు
కమిన్స్‌తో పాటు గాయాల బెడదతో ఆటకు దూరంగా ఉన్న మరో కీలక పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood)తో పాటు హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ (Tim David) కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు సంపాదించారు. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగానే ఈ ముగ్గురు జట్టులో ఉంటారా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.

జనవరి ఆఖరి వారంలో కమిన్స్‌ స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన అతడికి వెన్నునొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. తొడ కండరాల గాయం, కాలి నొప్పితో బాధ పడుతున్న హాజిల్‌వుడ్‌ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు.

డ్వార్షుయిస్‌కు మొండిచేయి
ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా టిమ్‌ డేవిడ్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ నాటికి అతడు కోలుకోకపోతే ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తప్పదు. కాగా లెఫ్టార్మ్‌ సీమర్‌, గతేడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బెన్‌ డ్వార్షుయిస్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.

ఒకవేళ టోర్నీ నాటికి కమిన్స్‌, హాజిల్‌వుడ్‌లలో ఎవరో ఒకరు అందుబాటులో లేకుంటే డ్వార్షుయిస్‌కు ఛాన్స్‌ రావొచ్చు. అతడు కూడా గాయం వల్ల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా.. వేగంగానే కోలుకుంటున్నట్లు సమాచారం.

వారికి నిరాశే
మరోవైపు.. స్పిన్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా కూపర్‌ కన్నోలి ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌గా జోష్‌ ఇంగ్లిస్‌ ఒక్కడినే సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఫిలిప్‌లకు నిరాశతప్పలేదు. 

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ టోర్నీ మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో 2021లో తొలిసారి చాంపియన్లుగా నిలిచిన ఆసీస్‌.. ఈసారి మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో గత ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.

టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

చదవండి: రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. ఇలా అయితే కష్టమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement