టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.
రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్‌లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అనూహ్య రీతిలో
ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.
ఒత్తిడి చేశారు
అయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్‌లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.
నిజాన్ని మీరే బయటపెట్టాలి
రోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్‌నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్‌ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.
ఇద్దరూ సిద్ధం
అదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.
ఇటీవలే రోహిత్‌ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్‌లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం


