
కోహ్లితో భువీ (PC: BCCI)
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తో తన అనుబంధం ఏళ్లుగా కొనసాగుతోందని.. అయితే, ఇప్పుడు తమ మధ్య జరిగే సంభాషణలు పూర్తిగా మారిపోయాయని వెల్లడించాడు.
జట్టులో చోటు గల్లంతు
కాగా కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న భువీ.. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకబడిపోయాడు. టీమిండియా తరఫున 2022లో చివరగా ఆడిన భువనేశ్వర్ కుమార్.. ఆ తర్వాత వివిధ లీగ్‌లలో సత్తా చాటినా రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.
మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు పేస్ దళంలో కీలకంగా మారగా.. వీరితో పాటు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ కృష్ణల రాకతో భువీ స్థానం గల్లంతైంది.
తిరిగి ఆర్సీబీ గూటికి
ప్రస్తుతం లీగ్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2025 మెగా వేలంలో కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రైటార్మ్ పేసర్‌ను వదిలేయగా.. ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు అతడిని కొనుక్కుంది. ఇందుకు తగ్గట్లుగానే భువీ పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కలిసి 17 వికెట్లు కూల్చిన భువీ.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆర్సీబీలోకి పునరాగమనం చేసిన వెంటనే.. తన పాత కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఈ మేర జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే
ఈ నేపథ్యంలో తాజాగా భువనేశ్వర్ కుమార్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కోహ్లితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అప్పట్లో ఉన్నట్లు కాదు. మేము ఇప్పుడు మా కుటుంబాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం.
క్రికెట్ కాకుండా.. మిగిలిన జీవితం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నాం. అప్పట్లో మేము యువకులం. అప్పటికి పెళ్లిళ్లు కూడా కాలేదు. అందుకే అందరు యువకుల మాదిరే మేము కూడా జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపేవాళ్లం. కానీ ఇప్పుడు మేము పరిణతి చెందిన పురుషులం.
వయసు పెరుగుతోంది కదా!
ఏదేమైనా మైదానంలో మాత్రం మేము ఎప్పుడూ ప్రొఫెషనల్‌గానే ఉంటాము. ఆర్సీబీ లేదంటే.. ఏ ఫ్రాంఛైజీ అయినా ఓ ఆటగాడిని కొన్నదంటే.. జట్టులోని మిగతా సభ్యులతో అతడికి స్నేహం ఉన్నా లేకపోయినా.. మైదానంలో సమిష్టిగా విజయం కోసం పోరాడాల్సి ఉంటుంది.
అందుకే గ్రౌండ్‌లో మేము కేవలం ఆట గురించి మాత్రమే చర్చించుకుంటాం. అయితే, ఆట ముగిసిన తర్వాత అంతా మళ్లీ మామూలే. మా వయసు పెరుగుతోంది కదా! అందుకే.. అప్పటికీ.. ఇప్పటికీ సంభాషణల్లో చాలా మార్పులు వచ్చాయి’’ అని 35 ఏళ్ల భువీ చెప్పుకొచ్చాడు.