మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్‌నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.
ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్‌కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది.
దీని వల్ల శ్రేయస్‌కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్‌కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.
ఒకవేళ శ్రేయస్‌కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.
ఆ సమయానికి శ్రేయస్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.


