ఈస్ట్ బెంగాల్ రికార్డు విజయం
9–0 గోల్స్ తేడాతో సెసా అకాడమీపై గెలుపు
భారత మహిళల ఫుట్‌బాల్ లీగ్
కోల్‌కతా: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య... భారత మహిళల లీగ్ (ఐడబ్ల్యూఎల్)లో ‘హ్యాట్రిక్’తో విజృంభించింది. లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్న గుగులోత్ సౌమ్య... మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో... భారత మహిళల లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది.
లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 9–0 గోల్స్ తేడాతో... సెసా ఫుట్‌బాల్ అకాడమీపై విజయం సాధించింది. సౌమ్య (6వ, 54వ, 86వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో దుమ్ము రేపగా... ఫాజిలా ఇక్వాపుట్ (9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో సత్తా చాటింది. సులాజన రౌల్ (18వ నిమిషంలో), రెస్టీ నాన్‌జిరి (40వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ ఈస్ట్ బెంగాల్ జట్టు తమ స్థాయిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ 9 పాయింట్లతో... పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్‌బాల్ అకాడమీ 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు ఒక ‘డ్రా’తో 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం నీతా ఫుట్‌బాల్ అకాడమీతో ఈస్ట్ బెంగాల్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకొని ప్రత్యర్థి పోస్ట్‌పై దాడి చేయగా... ప్రత్యర్థి గోల్‌కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే బాక్స్ సమీపంలో బంతిని అందుకున్న తెలంగాణ స్ట్రయికర్ సౌమ్య... గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ చక్కటి గోల్‌తో ఈస్ట్ బెంగాల్ ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత సుష్మిత డీప్ నుంచి ఇచ్చిన పాస్‌ను చక్కగా అందుకున్న షాజిలా మరో గోల్‌తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది.
ఇక అక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్ పదేపదే దాడులతో రెచ్చిపోగా... వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టిన ఫాజిలా ‘హ్యాట్రిక్ పూర్తి చేసుకోగా... సులాజన రౌల్, రెస్టీ చెరో గోల్ సాధించారు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఈస్ట్ బెంగాల్ జట్టు 6–0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు గోల్స్ బాదగా... ఫాజిలా మరో గోల్ చేసింది. దీంతో ఈస్ట్‌బెంగాల్ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈస్ట్‌బెంగాల్ జట్టు తరఫున ఆల్‌టైమ్ టాప్ గోల్ స్కోరర్ (11)గా సౌమ్య నిలిచింది.


