మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఫుట్‌బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్వానజువాటో రాష్ట్రం సాలమంకాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. "సాకర్ మ్యాచ్ చివరి దశలో ఉండగా సాయుధులు స్టేడియం లోపలికి లోపలికి ప్రవేశించారు. వచ్చీ రావడంతోనే కనిపించిన వారిపైకి యధేచ్ఛగా కాల్పులకు దిగారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల పనేనని అందరికి తెలుసు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. నేర ముఠాలు అధికారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని సలామాంకా మేయర్ సీజర్ ప్రిటో పేర్కొన్నారు.
కాగా మెక్సికో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎక్కువ హత్యలు జరిగిన రాష్ట్రంగా గ్వానజువాటో నిలిచింది. ఇక్కడ ప్రధానంగా శాంటా రోసా డి లిమా, న్యూ జెనరేషన్ డ్రగ్ కార్టెల్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈ రెండు ముఠాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా సామాన్య ప్రజలు బలి అవుతున్నారు.


