breaking news
East Bengal
-
గుగులోత్ సౌమ్య ‘హ్యాట్రిక్’
కోల్‌కతా: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య... భారత మహిళల లీగ్ (ఐడబ్ల్యూఎల్)లో ‘హ్యాట్రిక్’తో విజృంభించింది. లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్న గుగులోత్ సౌమ్య... మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో... భారత మహిళల లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 9–0 గోల్స్ తేడాతో... సెసా ఫుట్‌బాల్ అకాడమీపై విజయం సాధించింది. సౌమ్య (6వ, 54వ, 86వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో దుమ్ము రేపగా... ఫాజిలా ఇక్వాపుట్ (9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో సత్తా చాటింది. సులాజన రౌల్ (18వ నిమిషంలో), రెస్టీ నాన్జిరి (40వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ ఈస్ట్ బెంగాల్ జట్టు తమ స్థాయిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ 9 పాయింట్లతో... పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్‌బాల్ అకాడమీ 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు ఒక ‘డ్రా’తో 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం నీతా ఫుట్‌బాల్ అకాడమీతో ఈస్ట్ బెంగాల్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకొని ప్రత్యర్థి పోస్ట్‌పై దాడి చేయగా... ప్రత్యర్థి గోల్‌కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే బాక్స్ సమీపంలో బంతిని అందుకున్న తెలంగాణ స్ట్రయికర్ సౌమ్య... గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ చక్కటి గోల్‌తో ఈస్ట్ బెంగాల్ ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత సుష్మిత డీప్ నుంచి ఇచ్చిన పాస్‌ను చక్కగా అందుకున్న షాజిలా మరో గోల్‌తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది. ఇక అక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్ పదేపదే దాడులతో రెచ్చిపోగా... వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టిన ఫాజిలా ‘హ్యాట్రిక్ పూర్తి చేసుకోగా... సులాజన రౌల్, రెస్టీ చెరో గోల్ సాధించారు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఈస్ట్ బెంగాల్ జట్టు 6–0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు గోల్స్ బాదగా... ఫాజిలా మరో గోల్ చేసింది. దీంతో ఈస్ట్‌బెంగాల్ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈస్ట్‌బెంగాల్ జట్టు తరఫున ఆల్‌టైమ్ టాప్ గోల్ స్కోరర్ (11)గా సౌమ్య నిలిచింది. -
చైనా, ఉజ్బెక్ క్లబ్‌లతో ఈస్ట్ బెంగాల్ పోరు
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఏఎఫ్సీ మహిళల చాంపియన్‌షిప్ గ్రూప్ ‘బి’లో చోటు దక్కింది. కౌలాలంపూర్‌లో తీసిన ‘డ్రా’లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టుకు ఒక రకంగా ఇది క్లిష్టమైన పోరే! ‘బి’ గ్రూపులో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన క్లబ్‌లతో ఈస్ట్ బెంగాల్ తలపడనుంది. ఈ సీజన్ భారత మహిళల లీగ్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ఏఎఫ్సీ మహిళల టోర్నీకి అర్హత సంపాదించింది.తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్‌కు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ దేశాలకు చెందిన దేశవాళీ చాంపియన్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. మొత్తం 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో చైనాకు చెందిన వుహాన్ జియాంగ్దా, ఇరానీ చాంపియన్ బమ్ ఖటూన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పీఎఫ్సీ నసఫ్ మహిళల క్లబ్ జట్లు (డబ్ల్యూఎఫ్సీ) ఉన్నాయి. జియాంగ్లా ఐదుసార్లు చైనీస్ లీగ్‌లో విజేతగా నిలిచింది. బమ్ ఖటూన్ (ఇరాన్) అయితే ఏఎఫ్సీ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాలుగోసారి. ఇక ఉజ్బెకిస్తాన్‌లో తిరుగులేని దేశవాళీ జట్టు పీఎఫ్సీ నసఫ్. ఈ జట్టు ఏకంగా 16 సార్లు అక్కడ విజేతగా నిలిచింది. ఇలాంటి ఘనాపాటిలతో భారత అమ్మాయిలు ఏ మేరకు తలపడతారో చూడాలి. నవంబర్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఈ మూడు జట్లతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.ఈ ఆరు జట్లతో పాటు మూడు గ్రూపుల్లో ఉన్న అత్యుత్తమ మూడో స్థానంలో ఉన్న మరో రెండు జట్లకు నాకౌట్ భాగ్యం దక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో క్వార్టర్ ఫైనల్ పోటీలు, మే నెలలో సెమీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ షెడ్యూల్ నవంబర్ 17: ఈస్ట్ బెంగాల్ X బమ్ ఖటూన్ ఎఫ్‌సీ (ఇరాన్ టీమ్) నవంబర్ 20: ఈస్ట్ బెంగాల్ X వుహాన్ జియాంగ్దా (చైనా టీమ్) నవంబర్ 23: ఈస్ట్ బెంగాల్ X పీఎఫ్సీ నసఫ్ (ఉజ్బెక్ టీమ్) -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం
వాస్కో (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ జట్టు ఖాతా తెరిచింది. 90వ నిమిషంలో రోచర్జెలా చేసిన గోల్‌తో నార్త్ ఈస్ట్ విజయం ఖాయమైంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్ తలపడతాయి. -
అంకిత్ కేసరీని వెంటాడిన దురదృష్టం
కోల్ కతా: దురదృష్టం వెంటాడితే ఎవరూ తప్పించుకోలేరు. బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ(20)ని దురదృష్టం వెంటాడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ ఆటగాడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. అసలు ఆటలోనే లేనప్పటికీ విధి ఆడిన మృత్యుక్రీడలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత శుక్రవారం ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కేసరీ సోమవారం తుదిశ్వాస విడిచాడు. మ్యాచ్ జరిగిన రోజున ఈస్ట్ బెంగాల్ జట్టులో అతడు 12వ ఆటగాడు మాత్రమే. ఫీల్డింగ్ చేస్తున్న ఆర్నాబ్ నంది అనే ఆటగాడు బ్రేక్ తీసుకోవడంతో అతడి స్థానంలో మైదానంలోకి వచ్చిన కేసరీ క్యాచ్ పట్టబోయి కుప్పకూలిపోయాడు. మరికొన్ని ఓవర్లు మాత్రమే మిగిలివుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బెంగాల్ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. కనీసం 11వ ఆటగాడిగా కూడా లేని కేసరీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే కేసరీ గతంలో బెంగాల్-19 టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. -
చరిత్ర సృష్టించిన సంధూ
న్యూఢిల్లీ: ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ భారత ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 79 ఏళ్ల తర్వాత తొలి అంచె యూరోపియన్ క్లబ్లో ఆడిన భారత ఆటగాడిగా తను రికార్డులకెక్కాడు. 2014 ఆగస్టులో సంధూ.. నార్వేయన్ టిప్పెలిగేన్ క్లబ్లో ఆడే స్టాబేక్ ఎఫ్‌సీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత శనివారం ఫోలో ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల సంధూ తొలిసారిగా బరిలోకి దిగాడు. సంధూకన్నా ముందు భారత్ నుంచి యూరప్ లీగ్‌ల్లో మొహమ్మద్ సలీం, బైచుంగ్ భూటియా, సునీల్ చెత్రి, సుబ్రతా పాల్ ఆడారు. అయితే టాప్ డివిజన్ క్లబ్లో సలీం మాత్రమే ఆడాడు. ఆయన 1936లో సెల్టిక్ తరఫున బరిలోకి దిగాడు.


