
నవంబర్‌లో ఏఎఫ్‌సీ మహిళల చాంపియన్స్ లీగ్
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఏఎఫ్‌సీ మహిళల చాంపియన్‌షిప్ గ్రూప్ ‘బి’లో చోటు దక్కింది. కౌలాలంపూర్‌లో తీసిన ‘డ్రా’లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టుకు ఒక రకంగా ఇది క్లిష్టమైన పోరే! ‘బి’ గ్రూపులో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్‌లకు చెందిన క్లబ్‌లతో ఈస్ట్ బెంగాల్ తలపడనుంది. ఈ సీజన్ భారత మహిళల లీగ్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ఏఎఫ్‌సీ మహిళల టోర్నీకి అర్హత సంపాదించింది.
తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్‌కు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ దేశాలకు చెందిన దేశవాళీ చాంపియన్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. మొత్తం 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో చైనాకు చెందిన వుహాన్ జియాంగ్దా, ఇరానీ చాంపియన్ బమ్ ఖటూన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పీఎఫ్‌సీ నసఫ్ మహిళల క్లబ్ జట్లు (డబ్ల్యూఎఫ్‌సీ) ఉన్నాయి. జియాంగ్లా ఐదుసార్లు చైనీస్ లీగ్‌లో విజేతగా నిలిచింది. బమ్ ఖటూన్ (ఇరాన్) అయితే ఏఎఫ్‌సీ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాలుగోసారి.
ఇక ఉజ్బెకిస్తాన్‌లో తిరుగులేని దేశవాళీ జట్టు పీఎఫ్‌సీ నసఫ్. ఈ జట్టు ఏకంగా 16 సార్లు అక్కడ విజేతగా నిలిచింది. ఇలాంటి ఘనాపాటిలతో భారత అమ్మాయిలు ఏ మేరకు తలపడతారో చూడాలి. నవంబర్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఈ మూడు జట్లతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.
ఈ ఆరు జట్లతో పాటు మూడు గ్రూపుల్లో ఉన్న అత్యుత్తమ మూడో స్థానంలో ఉన్న మరో రెండు జట్లకు నాకౌట్ భాగ్యం దక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో క్వార్టర్ ఫైనల్ పోటీలు, మే నెలలో సెమీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ షెడ్యూల్
నవంబర్ 17: ఈస్ట్ బెంగాల్ X బమ్ ఖటూన్ ఎఫ్‌సీ (ఇరాన్ టీమ్)
నవంబర్ 20: ఈస్ట్ బెంగాల్ X వుహాన్ జియాంగ్దా (చైనా టీమ్)
నవంబర్ 23: ఈస్ట్ బెంగాల్ X పీఎఫ్‌సీ నసఫ్ (ఉజ్బెక్ టీమ్)