వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఆసియా కప్‌కు అర్హత సాధించడం ద్వారా భారత అండర్-17 పురుషుల ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ ఫైనల్లో ఆసియా పవర్ హౌస్ ఇరాన్‌ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించింది.
అహ్మదాబాద్‌లోని ఈకే ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత్ ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరడం ఇది మూడోసారి మాత్రమే. ఆసియా కప్‌లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే..
మ్యాచ్ 19వ నిమిషంలో ఇరాన్ గోల్ చేసి ముందంజలోకి వెళ్లింది. హాఫ్ టైమ్‌కు ముందు దల్లాల్ముయోన్ గాంగ్టే (కుకి) పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోర్‌ను సమం చేశాడు. రెండో అర్దభాగంలో గున్లైబా వాంక్హైరక్పం (మీతై) కౌంటర్ అటాక్‌లో గోల్ కొట్టి భారత్‌ను చారిత్రక విజయం దిశగా నడిపించాడు.
జాతి ఘర్షణల్లో చిన్నాభిన్నమైన మణిపూర్‌కు చెందిన కుకి-మీతై తెగలకు చెందిన ఆటగాళ్లు కలిసికట్టుగా గోల్స్ చేసి భారత్‌ను గెలిపించడం విశేషం. ప్రస్తుత భారత జట్టులో 9 మంది మణిపూర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 7 మంది మీతై, 2 మంది కుకి తెగలకు చెందిన వాళ్లు. మణిపూర్ ఎప్పటినుంచో భారత ఫుట్‌బాల్‌కు ప్రతిభావంతుల్ని అందిస్తున్న టాలెంట్ ఫ్యాక్టరీగా కీర్తించబడుతుంది.


