ఇటీవల గోవాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన "బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్" యజమానులకు సంబంధించిన మరో క్లబ్ ను మంగళవారం కూల్చివేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గోవాలోని నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అక్రమ నిర్మాణంతో పాటు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడమే అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నైట్ క్లబ్ యజమాని గౌరవ్ లూథ్రాకు చెందిన బీచ్ షేక్ అనే మరో క్లబ్ ను కూల్చివేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో అధికారులు ఆ బీచ్ కూల్చివేతకు సిద్ధమవుతున్నారు. అక్కడే ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ "అక్రమంగా నిర్మించిన పోర్షన్ ను కూల్చివేయమని పర్యాటక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. నార్త్ గోవా కలెక్టర్ ఆకట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా పోలీసుశాఖ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఈ రోజు కూల్చివేతలు చేపడతారు" అని అన్నారు.
నైట్ క్లబ్ నిర్మాణం తాటాకులతో ఉండడంతో పాటు ఆ క్లబ్ కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకైన దారులు కావడంతో సహాయక బృందాలు సరైన సమాయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయన్నారు. గతంలోనూ ఆ క్లబ్ ను కూల్చివేయాలంటూ నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆ ప్రాంతంలోని నాయకులు తెలిపారు.
కాగా ఈ రోజు ఉదయం గోవా పోలీసులు విచారణ నిమిత్తం ఢిల్లీలోని నైట్ క్లబ్ యజమానుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలు లేరు. వీరిద్దరూ ప్రమాదం జరిగిన అనంతరం థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ నైట్‌క్లబ్ ఓనర్ గౌరవ్ లూథ్రా థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టులో ఉన్న చిత్రాలు బయిటకి వచ్చాయి. కాగా వీరిద్దరిపై అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ తో పాటు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేశారు.


