సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌కు చెందిన మరో ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. 1947–48 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఈ క్యాప్ ధరించాడు.
ఈ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 178.75 సగటుతో బ్రాడ్‌మన్ 715 పరుగులు (ఇందులో ఒక డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి) సాధించాడు. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన ఏకైక సిరీస్ ఇదే కాగా...స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత క్రికెట్ జట్టు తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

ఈతరంలో ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒక సారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్ ఇస్తే కెరీర్ చివరి వరకు దానినే వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి రోజుల్లో ప్రతీ సిరీస్‌కు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు కొత్త బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను అందించేవారు. అందు వల్లే బ్రాడ్‌మన్‌కు చెందిన పలు క్యాప్‌లు వేర్వేరు మ్యూజియంలలో ఉండగా, ఇతర క్యాప్‌లు, జ్ఞాపికలను పలువురు ప్రైవేట్ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్నారు.
1947–48 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్ సొహొని ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్ ముగిసిన అనంతరం వాసుదేవ్‌కు బ్రాడ్‌మన్ తన క్యాప్‌ను కానుకగా అందించాడు. గత 78 ఏళ్లుగా ఈ క్యాప్ వాసుదేవ్ కుటుంబం వద్దే ఉంది.
ఇప్పుడు దీనిని ప్రముఖ ఆక్షనర్ లీ హేమ్స్ వేలం వేస్తున్నాడు. జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సిరీస్‌లో బ్రాడ్‌మన్ ధరించిన మరో క్యాప్‌ను వేలం వేస్తే దానికి రూ.2.63 కోట్లు లభించాయి.


