సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..
నిన్న డిసెంబర్‌లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్‌నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పిల్లలను డిజిటల్ స్క్రీన్‌ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్‌లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..
పిల్లలను స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్‌లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్‌కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్‌లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.
అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్‌లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.
ఇంటర్నెట్‌లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..
::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలు
ఇప్పటిదాకా ..
ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట.


