భారత చెస్ ఆటగాడిపై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘ఫిడే’ వరల్డ్ చెస్ చాంపియన్‌ప్ బ్లిట్జ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దోహా వేదికగా జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన అర్జున్ కాంస్యం దక్కించుకున్నాడు. అంతకుముందు ర్యాపిడ్ విభాగంలోనూ అర్జున్ కాంస్యం గెలిచాడు. తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఒకే వరల్డ్ చాంపియన్‌షిప్ రెండు విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్జున్ నిలిచాడు.
సెమీఫైనల్‌కు ముందు 19 రౌండ్‌లలో కలిపి 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన అర్జున్... వరల్డ్ నంబర్‌వన్ కార్ల్‌సన్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లపై విజయాలు సాధించాడు. అయితే సెమీస్‌లో మాత్రం ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ అబ్దుసత్తొరోవ్ నొదిర్‌బెక్ చేతిలో ఓడి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ‘చదరంగంలో భారత్ జోరు కొనసాగుతోంది. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ విభాగంలో కాంస్యం నెగ్గిన అర్జున్ ఇరిగేశికి అభినందనలు.
ఇటీవల ర్యాపిడ్ విభాగంలోనూ కాంస్యం నెగ్గిన అర్జున్... బ్లిట్జ్‌లోనూ సత్తా చాటాడు. అతడి విజయం దేశ యువతకు స్ఫూర్తి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ‘ఫిడే’ బుధవారం పతకాలు అందజేసింది.
అర్జున్ రెండు కాంస్య పతకాలు అందుకోగా, మహిళల ర్యాపిడ్‌లో కాంస్యం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపికి కాంస్యం అందించారు. కార్ల్‌సన్ అటు ర్యాపిడ్, ఇటు బ్లిట్జ్ రెండు విభాగాల్లోనూ విజేతలుగా నిలిచాడు. ముగింపు కార్యక్రమంలో ‘ఫిడే’ అధికారులతో పాటు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాల్గొన్నాడు.
‘నాకౌట్‌లో నమ్మకం కలిగింది’
వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లలో రెండు టైటిల్స్ సాధించడం పట్ల నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు సంబంధించి ఆరంభంలో టోర్నీ కఠినంగా సాగినా...చివరకు గెలవగలనని నమ్మానని అతను చెప్పాడు. ‘ఈ టోర్నమెంట్ ఆశించినంత సులువుగా సాగలేదు. ఫలితం ప్రతికూలంగా కూడా వచ్చి ఉండేది. అయితే నాకౌట్‌కు వెళ్లిన తర్వాత నాపై నమ్మకం పెరిగింది. ఈ దశలో మరింత ఉత్సాహంగా, బాగా ఆడగలనని అనిపించింది. చివరకు అది బాగా పని చేసింది’ అని విజయానంతరం కార్ల్‌సన్ వ్యాఖ్యానించాడు.
మరో వైపు రెండు టైటిల్స్ నెగ్గినా కార్ల్‌సన్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించాడంటూ వివాదం రేగింది. స్విస్ విభాగం 14వ రౌండ్‌లో హైక్ మారి్టరోస్యాన్ (ఆర్మేనియా)తో అతను తలపడిన సందర్భంలో అనూహ్య ఘటన జరిగింది. వేగంగా ఆడే ప్రయత్నంలో అతని చేతులు తగిలి బోర్డుపై ఉన్న పావులు కొన్ని కింద పడిపోయాయి. అప్పటికి అతని వద్ద రెండు సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉంది.
పావులను సరైన స్థానంలో పెట్టే ప్రయత్నంలో అతను టైమింగ్ క్లాక్‌ను నిలిపివేశాడు. ఫలితంగా అతనికి ఆ రెండు సెకన్ల అదనపు సమయం కలిసొచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధం. దాంతో ఆర్బిటర్స్ జోక్యం చేసుకొని మాగ్నస్‌పై చర్య తీసుకున్నారు. మార్టిరోస్యాన్‌ను విజేతగా ప్రకటించారు. దీనికి అంగీకరిస్తూ అతను వైదొలిగాడు.


