
జింబాబ్వే పర్యటనను శ్రీలంక విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 7 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆతిథ్య జట్టుపై లంకేయులు పై చేయి సాధించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక దూసుకెళ్లింది.
మదుషంక హ్యాట్రిక్..
కాగా 299 పరుగుల లక్ష్యఛేదనలో 49 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 289/5తో నిలిచింది. జింబాబ్వే విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా... ఆఖరి ఓవర్ వేసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్షాన్ మదుషంక (4/62) శ్రీలంకను గెలిపించాడు.
తొలి మూడు బంతులకు వరుసగా సికందర్ రజా (87 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రాడ్ ఇవాన్స్ (0), రిచర్డ్ నరావా (0)ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేయగలిగిన జింబాబ్వే 7 పరుగుల తేడాతో ఓడింది.
నిశాంక, జనిత్ హాఫ్ సెంచరీలు..
అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. నిశాంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు), జనిత్ లియనాగె (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులకు పరిమితమైంది. బెన్ కరన్ (90 బంతుల్లో 70; 8 ఫోర్లు), కెప్టెన్ సీన్ విలియమ్స్ (54 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే చివర్లో ఒత్తిడికి తట్టుకోలేకపోయిన జింబాబ్వే జట్టు పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: టైటాన్స్ ఓటమితో మొదలు