
తొలి పోరులో తలైవాస్ విజయం
వైజాగ్‌లో ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కొత్త సీజన్‌ను కూడా తెలుగు టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఈసారి విశాఖపట్నం వేదికగా కూడా శుభారంభం చేయలేకపోయింది. శుక్రవారం ప్రారంభమైన పీకేఎల్ 12వ సీజన్ తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లు సాధించగా, కెప్టెన్ విజయ్ మలిక్ 6 పాయింట్లు నమోదు చేశాడు.
తలైవాస్ జట్టులో రైడర్ అర్జున్ దేశ్‌వాల్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెపె్టన్ పవన్ సెహ్రావత్ చెలరేగి 9 పాయింట్లతో జట్టును విజయం దిశగా నడిపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి తలైవాస్ జట్టు 14–13తో ఆధిక్యంలో నిలవగా, రెండో అర్ధ భాగంలోనూ రెండు పాయింట్లు ముందంజలో నిలిచిన జట్టు చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. మొదటి రోజే జరిగిన రెండో మ్యాచ్‌లో ‘టైబ్రేక్’ ద్వారా ఫలితం వచ్చింది. బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్ మధ్య జరిగిన ఈ పోరు నిర్ణీత సమయంలో 32–32తో సమంగా ముగిసింది.
బుల్స్ తరఫున ఆకాశ్ షిండే 12, ఆశిష్ మలిక్ 8 పాయింట్లు సాధించగా... పల్టన్ ఆటగాళ్లలో ఆదిత్య షిండే 9, పంకజ్ మోహితే 6 పాయింట్లు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత పుణేరీ ‘టైబ్రేక్’లో విజయం సాధించింది. ఐదు రైడ్‌ల ఈ టైబ్రేక్‌ను పల్టన్ 6–4తో గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.